Saturday, December 31, 2011

నాన్ కటాయి

ఈ కుకీస్ ను ఎప్పుడో ఒకసారి టీవీ షోలో చూశాను.చాలా నచ్చాయి.

సింపుల్ గా పావుగంటలో చేసేసుకోవచ్చు.తింటుంటే కరిగిపోతూ చాలా 

బావుంటాయి.







కావలసిన పదార్ధాలు:


మైదాపిండి                       ఒకటిన్నర కప్పు  

పంచదార                         ఒక కప్పు 

నెయ్యి                            ఒక కప్పు 

ఇలాచీ పొడి                      అర స్పూన్ 

కాజూ                               కొద్దిగా 



తయారు చేసే విధానం:


పంచదారను పొడి చేసుకోవాలి 

నెయ్యి,పంచదార పొడి బాగా కలిపి,మైదాపిండి,ఇలాచీపొడి వేయాలి.

ఈ మిశ్రమాన్ని ముద్దగా చేసుకోవాలి.ఈ లోగా మైక్రోవేవ్ ను కన్వెక్షన్ 

మోడ్ లో 180 డిగ్రీల  లో  ప్రీహీట్ చెయ్యాలి.

మిశ్రమాన్ని చిన్నచిన్న బిస్కెట్స్ లా చేసి,కాజూను అద్ది  బేకింగ్ ట్రే లో 

ఉంచి 12  - 15  నిముషాలు బెక్ చేస్తే సరిపోతుంది.ఓవెన్ ను బట్టి 

రెండు నిముషాలు ఎక్కువ తక్కువ పట్టొచ్చు.

పైన కొంచెం సాఫ్ట్ గా ఉన్నట్టు అనిపించినా చక్కగా పొంగి చాలా 

క్రిస్పీగా బేక్ అవుతాయి.

కాజూ,బాదం సన్నగా తరిగి పిండిలోకలిపేసి అయినా చెయ్యొచ్చు.

నోట్ : ఇందులో నెయ్యి వేసేటప్పుడు కరిగించనవసరం లేదు. 


Share/Bookmark

Wednesday, December 28, 2011

కాప్సికమ్ బజ్జీ (ఆలూ స్టఫ్డ్ )

చల్లని వాతావరణంలో అందరూ బజ్జీలు ఇష్టపడతారు.ఆలూ కర్రీ స్టఫ్ 

చేసి చేసే ఈ కాప్సికమ్ బజ్జీ వెరైటీగా ఉంటుంది.కూర రెడీగా ఉంటే 

అయిదు నిమిషాల్లో చేసెయ్యొచ్చు.








కావలసిన పదార్ధాలు:


కాప్సికమ్                         ఒకటి 

ఆలూ కర్రీ                       ఒక కప్ 

శనగపిండి                      ఒక కప్ 

బియ్యంపిండి                మూడు టీ స్పూన్స్ 

ఉప్పు,కారం,చిటికెడు వంటసోడా,నూనె 



తయారు చేసే విధానం:


కాప్సికమ్ లోగింజలు తీసేసి పొడవుగా వాలికలుగా కోసుకోవాలి.

ఈ కాప్సికమ్ స్ట్రిప్ లో ఆలూకర్రీ స్టఫ్ చేసుకోవాలి. 

శనగపిండి.బియ్యంపిండి ఒక బౌల్ లో వేసుకుని తగినంత  ఉప్పు,

కారం,వంటసోడా వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. 

స్టఫ్ చేసిన కాప్సికమ్ స్త్రిప్స్ ను ఈ పిండిలో ముంచి కాగిన నూనెలో 

బజ్జీలు వేసి,రెండువైపులా వేయించి తీయాలి.

వేడిగా టమాటా సాస్ తో తింటే బావుంటాయి,.


Share/Bookmark

Monday, December 26, 2011

కీమా పులావ్

మటన్ కీమాతో చేసే ఈపులావ్ చాలా సింపుల్ గా అయిపోతుంది.

ఎప్పుడూ తినే బిర్యానీల మధ్య వెరైటీగా ఉంటుంది.లైట్ ఫ్లేవర్స్ తో 

టేస్ట్ కూడా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


బాస్మతి రైస్                       ఒక గ్లాస్ 

మటన్ కీమా                      పావుకిలో 

ఉల్లిపాయ                          ఒకటి

పచ్చిమిర్చి                        మూడు 

పుదీనా                            అర కట్ట 

కొత్తిమీర                           అర కట్ట 

అల్లంవెల్లుల్లి ముద్ద              రెండు టేబుల్ స్పూన్స్ 

గరం మసాలా పొడి              రెండు టీ స్పూన్స్ 

ఉప్పు,కారం,పసుపు,పెరుగు 

షాజీర.లవంగాలు,చెక్క,యాలకులు,బిర్యానీఆకు,అనాసపువ్వు,జాపత్రి 


తయారు చేసే విధానం:


రెండు టీ స్పూన్స్ పెరుగులో కొంచెం ఉప్పు,కారం,పసుపు,అల్లంవెల్లుల్లి 

ముద్ద,ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి కలిపాలి.కడిగి ఉంచిన 

కీమాను ఇందులో కలిపి ఒక అరగంట ఉంచాలి.

బాస్మతిబియ్యం కడిగి ఇరవై నిముషాలు నానబెట్టుకోవాలి.

నూనె వేడిచేసి మసాలాదినుసులు అన్నీవేయాలి.సన్నగా వాలికలుగా 

తరిగిన ఉల్లిపాయ,మిర్చి వేసి ఎర్రగా వేగనివ్వాలి.

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.మారినేట్ చేసిన కీమా 

వేసి,కలపాలి. కొంచెం ఉడికిన తరువాత తరిగిన పుదీనా,కొత్తిమీర,

పసుపు,కారం,గరంమసాలా పొడి అన్నీ వేసి వేయించాలి.

చివరగా బియ్యం వేసి కలిపి రెండు మూడు నిముషాలు వేయించాలి.

ఇప్పుడు తగినన్ని నీళ్ళు,ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మూడు విజిల్స్ 

రానివ్వాలి.

వేడివేడిగా రైతాతో కానీ,నాన్ వెజ్ కర్రీతో కానీ తింటే బావుంటుంది.


Share/Bookmark

Friday, December 23, 2011

అరటికాయ కోఫ్తా

ఉడికించిన అరటికాయతో చేసిన కోఫ్తాలు ఇవి.ఇలాగే స్నాక్స్ లాగా 

కానీ,అన్నంలో కలుపుకునీ, గ్రేవీలో వేసి చపాతీతో అయినా తినొచ్చు.

సాంబారు,రసం వీటితో తిన్నా బావుంటాయి.







కావలసిన పదార్ధాలు:


అరటికాయ                      ఒకటి 

ఉల్లిపాయ                       ఒకటి

మిర్చి                           రెండు 

అల్లం                           చిన్నముక్క 

కార్న్ ఫ్లోర్                    రెండు టేబుల్ స్పూన్స్

జీడిపప్పు                      ఒక టేబుల్ స్పూన్ 

గరంమసాలాపొడి             అర స్పూన్ 

పొదీనా,కొత్తిమీర               కొంచెం 

ఉప్పు,నూనె 


తయారు చేసే విధానం:


అరటికాయ ఉడికించి తురుముకోవాలి.

ఇందులో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం,పొదీనా,కొత్తిమీర,కాజూ 

ముక్కలు వేసి కలపాలి.

తగినంత ఉప్పు,మసాలాపొడి,కార్న్ ఫ్లోర్ కూడా వేసి ముద్దచేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలు చేసి కాగిన నూనెలో వేయించి 

తీసుకోవాలి.

స్నాక్స్ గా అయితే టమాటాసాస్ లేదా గ్రీన్ చట్నీ తో బావుంటాయి.




Share/Bookmark

Tuesday, December 20, 2011

సాదా (తొక్కుడు)లడ్డు

మేము సాదాలడ్డు అంటాము.కొంతమంది తొక్కుడులడ్డు అంటారు.

దీనినే బందరు లడ్డు అని కూడా అంటారు.కారప్పూస వండి గ్రైండ్ చేసి 

కొంచెం పనే కానీ రుచి చాలా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


శనగపిండి                     రెండు కప్పులు 

పంచదార                      రెండు కప్పులు 

ఇలాచీ పొడి                   అర స్పూన్ 

నెయ్యి                          ఒక కప్పు

కాజూ, నూనె 


తయారు చేసే విధానం:


శనగపిండి జల్లించి తగినన్ని నీళ్ళతో ముద్దగా కలుపుకోవాలి.

కాగిన నూనెలో ఈ పిండిని కారప్పూస వత్తుకుని రెండువైపులా 

వేయించి తీసుకోవాలి.అయితే ఎర్రబడనివ్వకూడదు

కొంచెం చల్లారాక ఈ కారప్పూసను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

పంచదారలో కొంచెం నీళ్ళు పోసి కరిగించి పాకం పట్టుకోవాలి.ఇందులో 

గ్రైండ్ చేసుకున్నపొడి,కరిగిన నెయ్యి,యాలకుల పొడి వేసి కలపాలి.

కొంచెం చల్లారాక ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసి తీసుకోవాలి.(ఈ స్టెప్ 

ఆప్షనల్.లడ్డూ సాఫ్ట్ గా రావడం కోసం నేను ఇలా చేస్తాను. అసలు 

అయితే ఈ మిశ్రమాన్నిరోట్లోవేసి దంచి లడ్డూలు చేస్తారు.అందుకే 

తొక్కుడులడ్డు అని పేరు )

నేతిలో వేయించిన కాజూ కలిపి లడ్డూలు చేసుకోవాలి.






Share/Bookmark

Sunday, December 18, 2011

నేతిబీరకాయ పచ్చడి



కార్తీకమాసంలో తప్పనిసరిగా తినే ఈ నేతిబీర పచ్చడి చాలా ఫేమస్.

మామూలు బీరకాయలా కాకుండా ఈకాయ నున్నగా ఉంటుంది








కావలసిన పదార్ధాలు:


నేతిబీరకాయలు                       రెండు 

టమాటా                               ఒకటి

పచ్చిమిర్చి                           ఆరేడు 

వెల్లుల్లిరెబ్బలు                        నాలుగు 

ఉప్పు,చింతపండు,జీలకర్ర,నూనె 


తయారుచేసే పధ్ధతి :


బీరకాయలు చెక్కు తీసి ముక్కలు కోయాలి.

టమాటా,మిర్చి ఈ ముక్కలు కలిపి రెండు స్పూన్స్ నూనె వేసి బాగా 

దగ్గరయ్యేవరకు మగ్గనివ్వాలి.

చల్లారిన తరువాత ఉప్పు,జీలకర్ర,వెల్లుల్లి,చింతపండు, మిర్చి గైండ్ 

చేసుకుని,బీరకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి.

కావాలంటే కొంచెం కొత్తిమీర,కొంచెం పచ్చికొబ్బరి కూడా వేసుకోవచ్చు.
 


Share/Bookmark

Wednesday, December 14, 2011

మేథీ వెజ్ కర్రీ

పూరీ,చపాతీ వీటిలోకి ఎక్కువగా చేసేది మిక్స్డ్ వెజ్ కర్రీ.ఇందులోనే 

మెంతికూర, పనీర్ వేసి చేస్తే వెరైటీగా వుంటుంది.









కావలసిన పదార్ధాలు:


మిక్స్డ్ వెజిటబుల్స్                    ఒక కప్పు 

మెంతికూర                            మూడు కట్టలు

పనీర్ తురుము                       అర కప్పు 

టమాటాలు                            రెండు 

పచ్చికొబ్బరితురుము                పావుకప్పు   

ఉల్లిపాయ                             ఒకటి 

పచ్చిమిర్చి                           రెండు

మీగడ                                ఒక టేబుల్ స్పూన్ 

అల్లంవెల్లుల్లి ముద్ద                   ఒక టీ స్పూన్ 

గరంమసాలా పొడి                   ఒక టీ స్పూన్ 

ఉప్పు, కారం ,పసుపు ,నూనె ,కొత్తిమీర ,కరివేపాకు.ఆవాలు,జీలకర్ర 


తయారు చేసే విధానం:


కూరగాయలు (ఆలూ,కారట్,కాలీఫ్లవర్,బీన్స్) అన్నీ చిన్నముక్కలు 

కోసి బటానీలు కలిపి ఉడికించాలి.

టమాటాలు ఉడికించి పచ్చికొబ్బరితో కలిపి పేస్ట్ చేసుకోవాలి.

నూనె వేడిచేసి ఆవాలు,జీలకర్ర,కరివేపాకు వేసి,సన్నగా తరిగిన ఉల్లి,

మిర్చి వేయించాలి.అల్లంవెలుల్లి పేస్ట్ వేసి వేగిన తరువాత తరిగిన 

మెంతికూర వేసి వేయించాలి.

ఇప్పుడు టమాటాపేస్ట్ వేసి కొంచెం ఉడికిన తరువాత కూరగాయ

ముక్కలు అన్నీవేసి కలిపి తగినంత ఉప్పు,కారం,పసుపు వేయాలి.

కొద్దిగా నీళ్ళు పోసి రెండునిమిషాలు ఉడికించి పనీర్ తురుము,మీగడ 

వేసి కలపాలి.

చివరగా మసాలాపొడి,కొత్తిమీర వేసి కూర కొంచెం దగ్గరయ్యాక స్టవ్ 

ఆఫ్ చెయ్యాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కొంచెం తురిమిన పనీర్, క్రీం వేసి 

అలంకరించాలి.


Share/Bookmark

Saturday, December 10, 2011

ఓట్స్ దోశ

ఇన్ స్టంట్ గా ఐదునిముషాలు కేటాయించి పిండి కలిపేసుకుంటే 

చక్కగా ఈ ఓట్స్ దోసెలు వేసుకోవచ్చు.ఎక్కువసేపు నానితే రవ్వ

దోశలాగా పలుచగా బాగా వస్తాయి. 








కావలసిన పదార్ధాలు:


ఓట్స్                           రెండు కప్పులు 

బొంబాయి రవ్వ                ఒక కప్పు 

గోధుమపిండి                  ఒక కప్పు 

బియ్యం పిండి                 ఒక కప్పు 

ఉప్పు                            తగినంత 

నూనె 


తయారు చేసే విధానం;


ఓట్స్ మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

ఇందులో మిగిలినవి అన్నీవేసి తగినంత ఉప్పు,నీళ్ళు కలిపి దోసెల 

పిండిలా కలుపుకోవాలి.

పెనం వేడిచేసి రవ్వదోశ వేసినట్టు పిండిని గరిటతో పోసెయ్యాలి. కొంచెం 

నూనెవేసి రెండువైపులా కాల్చాలి.

కావాలంటే ఉల్లి,మిర్చి,అల్లం అన్నీసన్నగా తరిగి కలుపుకోవచ్చు.

వేడిగా ఏదైనా చట్నీతో తింటే బావుంటాయి.


Share/Bookmark

Wednesday, December 7, 2011

టమాటా - కొత్తిమీర పచ్చడి

పండుటమాటాలలో  కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసి చేసే ఈ పచ్చడి 

అన్నంలోకి,టిఫిన్స్ లోకి కూడా బావుంటుంది.కాస్త ఎక్కువ చేసుకుని 

ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు కూడా 






కావలసిన పదార్ధాలు:


టమాటాలు                      నాలుగు 

కొత్తిమీర                        ఒక కట్ట 

పచ్చిమిర్చి                    ఏడెనిమిది 

వెల్లుల్లి రెబ్బలు                నాలుగు 

జీలకర్ర                        అర స్పూన్ 

చింతపండు పేస్ట్             అర స్పూన్ 

ఉప్పు,నూనె,తాలింపు దినుసులు,కరివేపాకు 


తయారు చేసే విధానం:


టమాటా ముక్కలు,మిర్చి,కొత్తిమీర  రెండు టీస్పూన్స్ నూనె వేసి 

వేయించాలి.తడి అంతా పోయేవరకు మగ్గనివ్వాలి.

బాగా చల్లారిన తరువాత మిర్చి,జీలకర్ర,తగినంత ఉప్పు,వెల్లుల్లి గ్రైండ్ 

చేసుకుని టమాటా మిశ్రమం కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి.

ఒక స్పూన్ నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలపాలి. 






Share/Bookmark

Saturday, December 3, 2011

డేట్స్ - బ్రెడ్ లడ్డు

సింపుల్ గా అప్పటికప్పుడు చెయ్యగల లడ్డూ ఇది.ఖర్జూరాలు,నట్స్,

కొబ్బరి అన్నీఉంటాయి కనుక హెల్దీ కూడా. 







 
కావలసిన పదార్ధాలు:


బ్రెడ్ స్లైసెస్                        నాలుగు 

ఖర్జూరాలు                         పది

కొబ్బరితురుము                 అర కప్పు 

పంచదారపొడి                   మూడు స్పూన్స్ 

నెయ్యి                          రెండు టేబుల్ స్పూన్స్ 

ఇలాచీ పొడి                     కొద్దిగా 

కాజు,బాదం,కిస్మిస్ 


తయారు చేసే విధానం:


బ్రెడ్ స్లైసెస్ ను మిక్సీలో వేసి క్రంబ్స్ చేసుకోవాలి.

ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి వీటిని దోరగా వేయించుకోవాలి.(మైక్రోవేవ్ 

లో అయితే రెండు నిముషాలు హైలో పెట్టి, టెంపరేచర్ తగ్గించి మరో 

నిమిషం పెడితే సరిపోతుంది)

ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి కాజు,బాదం,కిస్మిస్ వేయించి తీయాలి.

ఇందులోనే కొబ్బరి తురుము కూడా వేసి ఒక నిమిషం వేయించాలి.

ఇప్పుడు బ్రెడ్,తరిగిన ఖర్జూరాలు,కొబ్బరి,పంచదార అన్నీఒకసారి 

గ్రైండ్ చేసి బౌల్ లోకి తీసుకోవాలి.

ఇలాచీపొడి,నట్స్ వేసి కలిపి లడ్డూలు చుట్టుకోవాలి.


Share/Bookmark

Wednesday, November 30, 2011

కారట్ - కోకోనట్ ఖీర్

పాలు తాగమన్నా,కారట్ తినమన్నా వినని పిల్లలకి బెస్ట్ ఆప్షన్ ఈ 

ఖీర్.కొబ్బరితురుము వేయడంతో కొంచెం క్రంచీగా బావుంటుంది.







కావలసిన పదార్ధాలు :


కారట్                            మూడు 

పాలు                            అరలీటరు 

కొబ్బరితురుము                ఒక కప్పు

పంచదార                        ఒక కప్ప

ఇలాచీ పొడి                    పావు స్పూన్ 

బాదం 


తయారు చేసే విధానం:


కారట్ ఉడికించి పేస్ట్ చేసుకోవాలి.

పాలు కాగాక  పంచదార వేసి మరిగించాలి.ఇందులో పచ్చికొబ్బరి 

తురుము వేసి కొంచెం ఉడికించాలి.

ఇప్పుడు కారట్ పేస్ట్ వేసి కలిపి సన్నని మంటపై కొంచెం చిక్కబడ్డాక 

ఇలాచీపొడి వేయాలి.

ఫ్రిజ్ లో ఉంచి సర్వ్ చేసే ముందు కొంచెం కొబ్బరితురుము,సన్నగా 

తురిమిన బాదం వేసి ఇస్తే చాలా రుచిగా ఉంటుంది.




Share/Bookmark

Monday, November 28, 2011

బీన్స్ - కారట్ పాటోళీ

పాటోళీ  ట్రెడిషనల్ రెసిపీ.బీన్స్,కారట్ బదులు గోరుచిక్కుళ్ళతో కూడా 

ఈ కూర చేసుకోవచ్చు.లేదా మెంతికూర,కాబేజ్ ఇలాంటివి వేసి కూడా 

చెయ్యొచ్చు.రైస్ లోకి,చపాతీలోకి వెరైటీగా బావుంటుంది.







కావలసిన పదార్ధాలు:


 ఫ్రెంచ్ బీన్స్                           ఒక కప్పు 

కారట్                                 ఒక కప్పు 

శనగపప్పు                            ఒక కప్పు 

పచ్చిమిర్చి                            మూడు 

అల్లం ముక్క                         చిన్నది 

జీలకర్ర                                ఒక టీ స్పూన్

కరివేపాకు                            ఒక రెమ్మ 

కొత్తిమీర                              కొంచెం

ఉప్పు,కారం,పసుపు,నూనె,గరంమసాలాపొడి,తాలింపుదినుసులు 


తయారు చేసే విధానం:


బీన్స్,కారట్ సన్నగా తరిగి ఉడికించాలి.

శనగపప్పు నానబెట్టుకోవాలి.ఇందులో అల్లం,మిర్చి,జీలకర్ర వేసి కోర్స్ 

గా గ్రైండ్ చేసుకోవాలి.  

నూనె వేడిచేసి తాలింపు వేసి శనగపప్పు పేస్ట్ వేసి వేయించాలి.కొంచెం 

పొడిగా అయ్యాక బీన్స్ కారట్ వేయాలి.

ఉప్పు,పసుపు,కారం వేసి కలిపి సిమ్ లో కూర పొడిగా అయ్యేవరకు 

వేయించి చివరగా కొత్తిమీర,మసాలాపొడి చల్లి కలపాలి.

వేడివేడి అన్నంలో ఈ కూరతో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా 

ఉంటుంది.   

ఇందులో పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి వాడొచ్చు.అలాగే ఇష్టం 

లేకపోతే మసాలాపొడి వేయడం మానెయ్యొచ్చు

           


Share/Bookmark

Friday, November 25, 2011

సేమ్యా కట్లెట్స్

సాయంత్రాలు స్నాక్స్ గా ఈ సేమ్యా కట్లెట్స్ బావుంటాయి.ఆలూ,కారట్ 

ఇలా కూరలు కూడా కలుపుతాము కాబట్టి పిల్లలూ ఇష్టంగా తింటారు.







కావలసిన పదార్ధాలు :


సేమ్యా                            రెండు కప్పులు 

ఆలూ                             రెండు 

కారట్                             ఒకటి 

ఉల్లిపాయ                        ఒకటి 

మిర్చి                            రెండు 

అల్లం                            చిన్న ముక్క 

కొత్తిమీర                         ఒక కట్ట 

బియ్యంపిండి                   అర కప్పు 

గరంమసాలాపొడి              ఒక టీ స్పూన్

ఉప్పు ,నూనె 


తయారుచేసే విధానం;  


సేమ్యాను ఉడికించి తీసుకోవాలి.

ఇందులో ఉడికించిన ఆలూ,కారట్,సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం,

కొత్తిమీర,తగినంత ఉప్పు,మసాలాపొడి వేసి బాగా కలపాలి.

ఇప్పుడు బియ్యం పిండి కూడా వేసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ గా నచ్చిన ఆకారంలో చేసుకుని 

నూనెలో వేయించి తీయాలి.

పేపర్ నాప్ కిన్ పై ఉంచితే ఎక్సెస్ ఆయిల్ పోతుంది.టమాటా సాస్ తో 

సర్వ్ చేస్తే రుచిగా ఉంటాయి.

కావాలంటే ఇంకా ఉడికించిన బీన్స్,బటానీ,కార్న్ కూడా వాడొచ్చు.






Share/Bookmark

Tuesday, November 22, 2011

చిక్కుడుకాయ ఫ్రై

చిక్కుడుకాయ కూర చాలామంది ఇష్టంగా తింటారు.మా ఇంట్లో అయితే 

రోజూ చేసినా ఇష్టమే.కాకపోతే కాయల్లో నిండుగా గింజలు ఉండాలి.ఫ్రై 

చేసినా,టమాటా కలిపి కూర ఒండినా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


చిక్కుడుకాయలు                  పావుకిలో 

కరివేపాకు                          ఒక రెమ్మ 

ఉప్పు,పసుపు,నూనె 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి,వెల్లుల్లిరెబ్బలు,

పచ్చికారం (కూరల్లో వేసే సంబారుకారం బావుండదు)



తయారు చేసే పద్దతి :


చిక్కుడు కాయలు ముక్కలు చేసి ఉడికించుకోవాలి.

ఈ కూర రుచి అంతా తాలింపు వేయడంలోనే ఉంటుంది.

నూనె వేడిచేసి పప్పులు,ఆవాలు,జీలకర్ర,అయిదారు వెల్లుల్లిరెబ్బలు 

కొద్దిగా చిదిమి వెయ్యాలి. ఇవి దోరగా వేగాక కరివేపాకు కూడా వేసి 

సిమ్ లో పెట్టి పచ్చికారం వెయ్యాలి.స్టవ్ హైలో ఉంటే కారం 

మాడిపోతుంది.

ఒక్క నిమిషం అన్నీవేయించి చిక్కుళ్ళు కూడా వేయాలి.తగినంత 

ఉప్పు,పసుపు వేసి ముక్కల్లో తడి పోయేవరకు వేయించాలి.


Share/Bookmark

Saturday, November 19, 2011

ఆలూ గోబీ ఫ్రై

కాలీఫ్లవర్ సీజన్ మొదలైంది.దీన్ని టమాటా,బటానీ,ఎగ్స్ ఇలా దేనితో 

వండినా ఇష్టంగా తినొచ్చు.ఆలూతో కలిపి చేసే ఈ వేపుడు అన్నంలోకి, 

చపాతీలోకి బావుంటుంది.







కావలసిన పదార్ధాలు:


కాలీఫ్లవర్                         ఒకటి చిన్నది 

ఆలూ                              రెండు 

ఉల్లిపాయ                          ఒకటి 

పచ్చిమిర్చి                        రెండు 

కరివేపాకు                         ఒక రెమ్మ 

కొత్తిమీర                          ఒక కట్ట

అల్లం                            చిన్న ముక్క 

వెల్లుల్లి                           నాలుగు రెబ్బలు

గరంమసాలా పొడి             అర టీస్పూన్ 

ఉప్పు,కారం,పసుపు,నూనె ,తాలింపు దినుసులు


తయారు చేసేవిధానం:


కాలీఫ్లవర్ ను చిన్నపువ్వులుగా విడదీసి ఆలూ ముక్కలతో కలిపి

కొంచెం ఉడికించి వార్చాలి.

నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,కరివేపాకు 

వేసి వాయించాలి.

అల్లం,మిర్చి,వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసుకుని ఈ పేస్ట్ వేసి వేయించాలి.

ఇప్పుడు ఉడికించిన ఆలూ,గోబీ వేసి కలపాలి.

తగినంత ఉప్పు,కారం,పసుపు వేసి ముక్కలు పూర్తిగా ఉడికేదాక 

వేయించాలి.

చివరగా గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి కలపాలి.
 




Share/Bookmark

Wednesday, November 16, 2011

బూందీ మిఠాయి

బెల్లం,కొంచెం పంచదార కలిపి చేసే అచ్చుమిఠాయి ఇది.పంచదార 

లడ్డూలా మెత్తగా కాకుండా కరకరలాడుతూ ఉంటుంది.చెయ్యగలిగితే 

వేడిమీద లడ్డూలు కూడా చుట్టుకోవచ్చు.







కావలసిన పదార్ధాలు:


శనగపిండి                           రెండు గ్లాసులు

బియ్యంపిండి                         ఒక గ్లాసు

బెల్లం                                 రెండు గ్లాసులు 

పంచదార                             ఒక గ్లాసు

యాలకుల పొడి                    ఒక టీ స్పూన్

నూనె 


తయారు చేసే విధానం:


శనగపిండి,బియ్యంపిండి తగినన్ని నీళ్ళతో కొంచెం జారుగా 

కలుపుకోవాలి.

ఈ పిండిని బూందీ గరిటలో వేసి కాగిన నూనెలో బూందీ దూసుకోవాలి.

వేగిన తరువాత తీసి జల్లెడలో వేసుకోవాలి.ఇలా బూందీ అంతా రెడీ 

చేసుకోవాలి  

బెల్లం,పంచదార కొంచెం నీళ్ళు పోసి కరిగించి వడపోయాలి.

ఇప్పుడు తిరిగి స్టవ్ పైన ఉంచి బాగా ఉండపాకం పట్టుకోవాలి.ఇందులో 

యాలకులపొడి,బూందీ వేసి బాగా కలిపి పళ్ళెంలో అచ్చు పోసెయ్యాలి.

కాసేపగితే అచ్చు వచ్చేస్తుంది.చిన్నచిన్నముక్కలు చేసి స్టోర్ 

చేసుకోవాలి.

కావాలనుకుంటే అచ్చు పోయకుండా లడ్డూలు చేసుకోవచ్చు.


Share/Bookmark

Sunday, November 13, 2011

ప్రాన్స్ దమ్ బిర్యానీ

నాన్ వెజ్ తో బిర్యానీ అంటే అందరికీ చాలా ఇష్టం.అదీ రొయ్యలతో చేస్తే 

భలే రుచిగా ఉంటుంది.జనరల్ గా ఈ దమ్ బిర్యానీ చెయ్యడం కష్టం 

అనుకుంటాము కానీ అలవాటు అయిపోతే ఈజీగా చేసెయ్యొచ్చు.

కొంచెం ప్లాన్డ్ గా అన్నీ రెడీ చేసుకోవాలి అంతే.









కావలసిన పదార్ధాలు:

మారినేషన్ కోసం

రొయ్యలు                         అరకిలో 

పెరుగు                           ఒక టేబుల్ స్పూన్ 

అల్లంవెల్లుల్లి పేస్ట్                ఒక టీ స్పూన్ 

గరంమసాలాపొడి               ఒక టీ స్పూన్ 

పచ్చిమిర్చి                         రెండు 

ఉప్పు,కారం ,పసుపు   


రైస్ కోసం 


బాస్మతి రైస్,ఉప్పు,పుదీనా,కొత్తిమీర,

బిర్యానీ మసాలాలు  

లవంగాలు,చెక్క,యాలకులు,షాజీరా,అనాసపువ్వు,మరాటీమొగ్గ,

జాపత్రి,బిర్యానీ ఆకు 


గ్రేవీ కోసం 

ఉల్లిపాయ                      ఒకటి 

పచ్చిమిర్చి                     రెండు

టమాటా                        ఒకటి(ప్యూరీ)

అల్లంవెల్లుల్లి పేస్ట్             ఒక టేబుల్ స్పూన్ 

గరంమసాలా పొడి           ఒక టీ స్పూన్ 

పుదీనా,కొత్తిమీర,ఉప్పు,పసుపు,కారం,నూనె ,నెయ్యి,కొంచెం పాలలో 

నానబెట్టిన శాఫ్రాన్ 


తయారు చేసే విధానం:


పెరుగులో అన్ని పదార్ధాలు కలిపి,శుభ్రం చేసిన రొయ్యలు వేసి ఒక 

గంట నాననివ్వాలి.

బాస్మతి రైస్ కడిగి ఇరవై నిముషాలు నానబెట్టాలి.

ఒక పెద్దగిన్నెలో నీళ్ళు మరిగించి,అందులో మసాలాదినుసులు,

పుదీనా కొత్తిమీర,కొంచెం ఉప్పు,రైస్ కూడా వేసి ఉడికించాలి.మూడు

వంతులు ఉడికాక వడపోసి రెడీ చేసుకోవాలి.

ఈలోగా ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేడిచేసి 

వాలికలుగా తరిగిన ఉల్లి,మిర్చి వేయించాలి.ఇందులో గ్రైండ్ చేసుకున్న 

టమాటాగుజ్జు అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.

ఇప్పుడు నానబెట్టుకున్నరొయ్యలు వేసి కలిపి తగినంత ఉప్పు,కారం,

పసుపు,గరంమసాలాపొడి,తరిగిన పొదీనా,కొత్తిమీర వేసి ఉడికించాలి.

గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక బిర్యానీకి అరేంజ్ చేసుకోవాలి.

ప్రెషర్ పాన్ లో కానీ,చిన్నకుక్కర్ లో కానీ కొంచెం నూనెవేసి సగం రైస్ 

పరవాలి.దానిమీద రొయ్యల గ్రేవీ సర్ది, పైన మిగిలిన రైస్ వేయాలి.

పైన రెండు స్పూన్ల నెయ్యి,తరిగిన పొదీనా,కొత్తిమీర వేసి కొంచెం 

పాలలో నానబెట్టిన సాఫ్రాన్ వేసుకోవాలి.

చిన్నబర్నర్ మీద తావా పెట్టి దానిమీద ఈ పాన్ పెట్టి వెయిట్ పెట్టాలి.

రెండుమూడు నిమిషాల తరువాత సిమ్ లో పెట్టెయ్యాలి.విజిల్స్ 

రానక్కరలేదు.ఇలా వెయిట్ పెట్టడం వలన స్టీం బయటికి పోదు.

ఒక పావుగంటలో బిర్యానీ ఘుమఘుమ వాసన వస్తుండగా స్టవ్ ఆఫ్ 

చెయ్యాలి.

ఒకసారి జాగ్రత్తగా కలిపి వేడిగా వడ్డిస్తే ప్రాన్ దమ్ బిర్యానీ నోరూరిస్తుంది.




Share/Bookmark

Friday, November 11, 2011

డేట్స్ - ఆల్మండ్ ఖీర్

బాదం,ఖర్జూరాలు కలిపి చేసే ఈ ఖీర్ చాలా హెల్దీ ఐటం.అస్సలు నెయ్యి 

వాడము కనుక కాలరీస్ భయం కూడా ఉండదు.బ్లాగ్ వనభోజనాలకు

రాసిన ఈ ఖీర్ ను ఇందులో రీపోస్ట్ చేస్తున్నాను. 









కావలసిన పదార్ధాలు : 


చిక్కని పాలు                       పావు లీటరు 

ఖర్జూరాలు                          పది 

బాదంపప్పు                         పది 

ఇలాచీ పొడి                        అర స్పూను 

మిల్క్ మెయిడ్                   రెండు టేబుల్ స్పూన్స్  



తయారు చేసే విధానం :


ముందుగా బాదంపప్పును వేడినీళ్ళల్లో నానబెట్టి పొట్టు తీసుకోవాలి.

ఖర్జూరాలు గింజలు తీసేసి కొంచెం నీటిలో ఉడికించాలి.

ఈ రెంటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.అవసరమైతే కొంచెం పాలు 

వాడొచ్చు.

ఇప్పుడు పాలను కొంచెం మరిగించి బాదం ఖర్జూర మిశ్రమం వేసి 

ఉడికించాలి.

చివరగా మిల్క్ మెయిడ్ వేసి కలపాలి.ఇది లేకపోతే తగినంత 

పంచదార వేసుకోవచ్చు.

ఇలాచీపొడి వేసి కొద్దిగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి.చల్లారాక ఇంకా 

చిక్కగా అవుతుంది 

సన్నగా తరిగిన బాదం,ఖర్జూరాలతో అలంకరించుకోవాలి. 

కాసేపు ఫ్రిజ్ లో ఉంచి తింటే బావుంటుంది.ఇష్టం ఉంటే చివరలో రెండు 

స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు.



Share/Bookmark

Tuesday, November 8, 2011

మలై ప్రాన్స్

నాన్ వెజ్ లో చికెన్ తరువాత చాలా ఇష్టంగా తినేవి రొయ్యలు.ఈ కర్రీ 

బిర్యానీ,పులావుల్లోకి,ముఖ్యంగా కొబ్బరన్నం(కొబ్బరిపాలతో చేసే రైస్)

లోకి చాలా బావుంటుంది.








కావలసిన పదార్ధాలు:


రొయ్యలు                             కిలో 

ఉల్లిపాయలు                         రెండు

పచ్చిమిర్చి                          రెండు 

కరివేపాకు                           ఒక రెమ్మ 

కొత్తిమీర                             ఒక కట్ట 

మీగడ(క్రీం)                        రెండు టేబుల్ స్పూన్స్  

అల్లంవెల్లుల్లి ముద్ద                 రెండు టీ స్పూన్స్

ఉప్పు,కారం,పసుపు,నూనె 

తాలింపుకు ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి 


మసాలా పొడి కోసం:

ఆరు లవంగాలు,చిన్న దాల్చినచెక్క ముక్క,ఒక టీస్పూన్ ధనియాలు,

అర టీస్పూన్ జీలకర్ర,ఒక టీస్పూన్ గసగసాలు,కొంచెం ఎండుకొబ్బరి 

అన్నీకలిపి మెత్తగా పొడి కొట్టుకోవాలి.


తయారు చేసే విధానం:


రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిముక్కలు,

మిర్చి,కరివేపాకు వేసి దోరగా వేయించాలి.

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి, గ్రైండ్ చేసుకున్నమసాలా

పొడి కూడా వేయాలి.పసుపు,కారం కొద్దిగా నీళ్ళు చల్లి బాగా కలపాలి.

రెండు నిమిషాల తరువాత శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసి 

ఉడికించాలి.

చివరగా తగినంత ఉప్పువేసి అవసరమైతే ఓ పావుకప్పు నీళ్ళు పోయాలి.

రొయ్యలు ఉడికి కూర దగ్గరవుతుండగా తరిగిన కొత్తిమీర,క్రీం వేసి కలిపి 

మరో రెండు నిముషాలు ఉడికించాలి.

ఎంతో రుచిగా ఉండే ఈ మలైప్రాన్స్ రోటీ,నాన్ వీటితో కూడా 

బావుంటుంది.
 


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP