Thursday, December 30, 2010

పాలక్ రైస్


ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదని అందరికి  తెలుసు కదా అందులో 

పాలకూర తో చేసే రైస్ ఐటం ఇది.సింపుల్ గా చాలా త్వరగా 

అయిపోయే  ఈ వెరైటీ కూడా లంచ్ బాక్స్ లో ఇవ్వడానికి చాలా 

బావుంటుంది.








 



కావలసిన పదార్ధాలు :

అన్నం                    రెండు కప్పులు

పాలకూర                 రెండు కట్టలు

ఉల్లిపాయ                ఒకటి

మిర్చి                     ఒకటి

కరివేపాకు                ఒక రెమ్మ

టమాటాలు              రెండు చిన్నవి

అల్లం వెల్లుల్లి ముద్డ     ఒక స్పూను

గరం మసాలా పొడి      ఒక స్పూను

పసుపు                  కొంచెం

ఉప్పు,కారం              తగినంత

కొత్తిమీర                  అర కప్పు.

నూనె                     రెండు టేబుల్ స్పూన్లు

లవంగాలు               రెండు 

దాల్చిన చెక్క            చిన్న ముక్క 


తయారు చేసే విధానం :

నూనె వేడి చేసి లవంగాలు,చెక్క వేయాలి.ఇప్పుడు సన్నగా తరిగిన 

ఉల్లిపాయ,మిర్చి, కరివేపాకులు వేసి దోరగా వేయించాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన పాలకూర వేసి చిటికెడు ఉప్పు వేసి నీరంతా 

పోయే  వరకూ మగ్గనివ్వాలి. 

తరిగిన టమాటా ముక్కలు కూడా వేసి ,బాగా వేగి నూనె తేలేవరకూ 

వేయించాలి.ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్డ ,పసుపు, కారం వేసి 

వేయించాలి.

ఇప్పుడు ఉడికించిన అన్నం, తగినంత ఉప్పు ,గరం మసాలా పొడి 

వేసి బాగా కలపాలి .సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి రెండు 

నిమిషాలు వేయించి దింపెయ్యాలి.

పైన కొంచెం కొత్తిమీర తో అలంకరించుకుంటే వేడిగా పాలక్ రైస్  రెడీ 

అవుతుంది.




Share/Bookmark

Monday, December 27, 2010

వంకాయ పకోడీ కూర



కూరలలో చాలామంది ఇష్టంగా తినేది వంకాయ కూర.ఆహా ఏమి రుచి  
అన్నా, ఏమి అన్నా ఈ వంకాయ కే చెల్లింది.అలాగే వంకాయ అనగానే  
గుత్తొంకాయ,బగార బైగన్, వంకాయ కొత్తిమీర కారం ఎక్కువ ఇవే  

గుర్తొస్తాయి.కానీ పొడుగ్గా సన్నగా ఉండే వంకాయలతో అల్లం,మిర్చి

వేసి చేసే వేపుడు చాలా రుచి గా ఉంటుంది.దానికి పకోడీ కూడా తోడైతే 

రుచి ఇంకా బావుంటుంది.




కావలసిన పదార్ధాలు:

వంకాయలు              పావు కిలో 

ఉల్లిపాయ                 ఒకటి చిన్నది

కరివేపాకు                 ఒక రెమ్మ

అల్లం                      చిన్న ముక్క

మిర్చి                     నాలుగు 

ఉప్పు, కారం              తగినంత

పసుపు                   కొంచెం 

గరంమసాలా పొడి        ఒక స్పూను

నూనె                      మూడు  టేబుల్ స్పూన్లు 

తాలింపుకు               శనగపప్పు,మినప్పప్పు,జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి 

పకోడీలకు  :

శనగపిండి               ఒక కప్పు 

వరి పిండి                రెండు స్పూన్లు 

ఉల్లిపాయ               ఒకటి 

మిర్చి                    మూడు

అల్లం                     చిన్న ముక్క

కరివేపాకు               ఒక రెమ్మ 

కొత్తిమీర                ఒక కట్ట 

ఉప్పు                    తగినంత  

వంట సోడా            చిటికెడు

నూనె 



తయారు చేసే విధానం:


నూనె వేడి చేసి శనగపప్పు.మినప్పప్పు.జీలకర్ర ,ఆవాలు,ఎండుమిర్చి

వేసి తాలింపు  వేసుకోవాలి. అవి వేగాక కరివేపాకు వెయ్యాలి.

సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.

ఇప్పుడు సన్నగా కోసిన వంకాయముక్కలు వేసి,సన్నని సెగపై మూత

పెట్టకుండా వేగనివ్వాలి.ముక్కలు కొంచెం మగ్గిన తరువాత

పసుపు,అల్లం,మిర్చి కలిపి నూరిన ముద్ద వేసి బాగా కలిపి  అదే

సెగలో వేగనివ్వాలి. 


ముక్కలు బాగా వేగిన తరువాత తగినంత ఉప్పు,కారం, గరం మసాలా

పొడి చల్లి బాగా కలపాలి 


ఈ లోగా  పకోడీ లకు కావలసిన అన్నింటిని  కొంచెం నీటితో పకోడీ

పిండిలా కలుపుకోవాలి.మరో స్టవ్ పై నూనె వేడిచేసి పకోడీలు 

వేసుకోవాలి.

వంకాయముక్కలు వేగేలోగా అటు పకోడీలు కూడా రెడీ అయిపోతాయి.

వేగిన పకోడీలను సన్నగా తరిగి కూరలో కలిపి,రెండు నిమిషాలు

వేయించి,తరిగిన కొత్తిమీర చల్లితే ఘుమఘుమలాడే వంకాయ పకోడీ

కూర రెడీ అవుతుంది.


నోట్:  ఈ కూరలో ఉప్పు మాత్రం చివరికి వెయ్యాలి.ముందే వేస్తే

వంకాయ ముక్కలు ముద్దగా అయిపోతాయి.


































































Share/Bookmark

Friday, December 24, 2010

బ్రెడ్ పుడ్డింగ్

కమ్మగా, మధురం గా ఉండే స్వీట్స్ అంటే అందరికీ ఇష్టమే.ఎన్ని 

తిన్నాఇంకా తినాలని అనిపిస్తుంది.  బ్రెడ్, ఎగ్స్ కలిపి చేసే ఈ 

పుడ్డింగ్ చేయడం చాలా సులువు. పిల్లలు చాలా ఇష్టం గా తింటారు 

కూడా.













కావలసిన పదార్ధాలు :

బ్రెడ్                   నాలుగు  స్లైసులు 

ఎగ్స్                  రెండు 

పాలు                 రెండు  కప్పులు 

పంచదార పొడి       ఒక కప్పు

వెనీలా ఎసెన్స్       అర స్పూను 

ఇలాచీ  పొడి         కొంచెం 

నెయ్యి                మూడు  టేబుల్ స్పూన్లు 

కాజూ,చెర్రీస్          అలంకరణకి  


తయారు చేసే విధానం :


ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని  మిక్సీ లో క్రంబ్స్  లా చేసుకోవాలి. 

ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ లో  రెండు స్పూన్లు నెయ్యి, బ్రెడ్ క్రంబ్స్ వేసి  

ఒక నిమిషం హై లో పెట్టాలి.తరువాత ఒకసారి కలిపి టెంపరేచర్ తగ్గించి 

ఇంకో నిమిషం పెడితే క్రిస్ప్ గా ఫ్రై అవుతాయి.

ఒక బౌల్ లో ఎగ్స్ వేసి బాగా బీట్ చెయ్యాలి. ఇందులో పాలు,

పంచదార పొడి  వేసి  బాగా కలిసేలా బీట్ చెయ్యాలి.

ఈ బీట్ చేసిన మిశ్రమంలో వేయించిన బ్రెడ్ క్రంబ్స్, ఇలాచీ  పొడి , 

వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ఓవెన్ ను కన్వెక్షన్ మోడ్ లో 220 డిగ్రీల లో ప్రీహీట్

చేసుకోవాలి 

తయారు చేసుకున్న బ్రెడ్ మిశ్రమాన్ని కొంచెం నెయ్యి రాసుకున్న 

బేకింగ్ మౌల్డ్ లో వేసుకుని పైన  కాజూ, చెర్రీస్ వేసి ప్రీహీట్  చేసుకున్న 

ఓవెన్ లో పదిహేను నిమిషాలు బేక్ చేసుకోవాలి   

వేడిగా తిన్నా, ఫ్రిజ్ లో ఉంచి చల్లగా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.











Share/Bookmark

Tuesday, December 21, 2010

రవ్వ దోశ

సామాన్యంగా దోసెలు ఇష్టపడని వారు ఉండరు.వేడి వేడి దోసెలు,

కొబ్బరి పచ్చడి చాలా మందికి హాట్ ఫేవరేట్ టిఫిన్,అలాగే ఈ దోసెల్లో ఎన్నిరకాలో. 

అన్ని దోసెల్లొనూ ఈ రవ్వ దోశ చేసుకోవడం చాలా తేలిక. 

పప్పు,బియ్యం నానబెట్టుకోడం,రుబ్బుకోడం ఇలాంటి పని ఏమి ఉండదు.

రవ్వ దోసెను కొందరు అప్పటికప్పుడు కలిపి వేస్తారు కానీ రాత్రి

పూట కలిపేసి నాననిచ్చి ఉదయం వేసుకుంటే చాలా బావుంటాయి.

ఎంత నానితే అంత బాగా తీగల్లా వస్తాయి.





కావలసిన  పదార్ధాలు:

బొంబాయిరవ్వ                  మూడు  కప్పులు

వరిపిండి                         ఒకటిన్నర కప్పు 

మైదా పిండి                      ముప్పావు కప్పు  

ఉల్లిపాయ                        ఒకటి 

మిర్చి                             మూడు 

అల్లం                              చిన్న ముక్క 

కరివేపాకు                        ఒక రెమ్మ 

కారట్ తురుము                 అర కప్పు 

కొత్తిమీర                          కొంచెం 

ఉప్పు                              తగినంత 


తయారు చేసే విధానం:

బొంబాయిరవ్వ,మైదా ,వరిపిండి  ఒక బౌల్ లో వేసుకుని నీళ్ళతో 

జారుగా  కలుపుకుని నాననివ్వాలి. 

ఉదయం ఈ పిండిలో తగినంత ఉప్పు,సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం 
 కరివేపాకు ,కొత్తిమీర కలపాలి.

కారట్ తురుము  కూడా కలిపి మరిన్ని నీళ్ళు పోసి బాగా పల్చగా చేసుకోవాలి. 

పేనం వేడెక్కాక ఈ పిండిని బాగా కలిపి  దోసె లాగ గుండ్రంగా పోసెయ్యాలి.

కదపడం అదీ చెయ్యకూడదు.

చుట్టూ నూనె వేసి బాగా కాలనివ్వాలి.

కొంచెం కలర్ వచ్చాక తిరగేసి రెండోవేపు కూడా కాలనివ్వాలి.

కొబ్బరి చట్నీ లేదా పల్లీల  పచ్చడి తో వడ్డిస్తే క్రిస్పీ గా ఉండే రవ్వ దోశ నోరూరిస్తుంది.

ఇష్టం ఉంటె ఇంకా ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు,జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు. 




















Share/Bookmark

Friday, December 17, 2010

వెరైటీ బ్రెడ్ స్నాక్

సన్నగా  చిరుజల్లులు పడుతుంటేనో, చలి గాలులు గిలిగింతలు  

పెడుతుంటేనో,  వేడివేడిగా  ఏమైనా  తినాలనిపిస్తుంది. ఎక్కువగా 

పకోడీలు,మిర్చిబజ్జి ఇవే చేస్తుంటాము. బ్రెడ్, పకోడీ కాంబినేషన్ లో 

చేసే ఈ స్నాక్  చాలా త్వరగా అయిపోతుంది. స్టవ్ పై నూనె వేడి 

అయ్యేలోపు రెడీ చేసుకుని చేసేయవచ్చు.














కావలసిన పదార్ధాలు:

బ్రెడ్                  4 స్లైసులు 

శనగపిండి          ఒక కప్పు 

వరిపిండి            రెండు టేబుల్ స్పూన్లు 

ఉల్లిపాయ           ఒకటి 

మిర్చి                రెండు 

అల్లం                చిన్న ముక్క 

కొత్తిమీర            కొంచెం 

కరివేపాకు          నాలుగు ఆకులు 

ఉప్పు                తగినంత 

వంటసోడా         చిటికెడు 

నూనె               డీప్ ఫ్రై కి సరిపడా 

టమాటాసాస్     


తయారు చేసే విధానం:


బ్రెడ్ స్లైసెస్ ని రెండుగా కట్ చేసుకోవాలి.

ఉల్లిపాయని వాలికలుగా, మిర్చి,అల్లం,కరివేపాకు ,కొత్తిమీర  వీటిని

సన్నగా తరగాలి.

శనగపిండి, వరిపిండి ఒక బౌల్ లో వేసి, తరిగినవి అన్నీ కలిపి ఉప్పు,

వంటసోడా వేసి కొంచెం నీటితో పకోడీ పిండిలా కలుపుకోవాలి.

ఇప్పుడు కట్ చేసిన బ్రెడ్ స్లైస్  ని తీసుకుని దానికి ఒక వైపు ఈ పకోడీ

పిండిని అప్లై చేసుకోవాలి.

కాగిన నూనెలో ఈ స్లైసు ను పిండి ఉన్నవైపు నెమ్మదిగా వదిలి రెండు

వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా  వేయించాలి.

క్రిస్ప్ గా ఉండే బ్రెడ్ ఒక వైపు, స్పైసీగా ఉండే పకోడీ ఒకవైపు ఉండే

వీటిని టొమాటో సాస్ తో వేడిగా తింటే చాలా రుచి గా ఉంటాయి.


Share/Bookmark

Tuesday, December 14, 2010

టేస్టీ ఫ్లేవర్డ్ రైస్




చాలా ఈజీగా, తొందరగా అయిపోయే మరో రైస్ ఐటం ఇది.ఎక్కువ 

మసాలాలు లేకుండా,ఒక వైపు పుదీనా ఫ్లేవర్,మరోవైపు కమ్మని పల్లీ, 

నువ్వుల ఫ్లేవర్ తో ఘుమమఘుమలాడే  ఈ వెరైటీ రైస్ చాలా రుచిగా 

ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ లో ఇవ్వడానికి కూడా చాలా 

బావుంటుంది.













కావలసిన పదార్ధాలు:

అన్నం                    రెండు కప్పులు

కారట్ తురుము         ఒక కప్పు

పుదీనా                  ఒక పెద్ద కట్ట 

ఉల్లిపాయ               ఒకటి

మిర్చి                    ఒకటి

కరివేపాకు               ఒక రెమ్మ

ఉప్పు,కారం             తగినంత

పసుపు                 చిటికెడు

గరంమసాలా పొడి     ఒక స్పూను

పల్లీలు                 రెండు టేబుల్ స్పూన్లు 

నువ్వులు             రెండు టేబుల్ స్పూన్లు

నూనె                  రెండు టేబుల్ స్పూన్లు

వేయించిన కాజూ     అలంకరణకి 



తయారు  చేసే  విధానం :

ముందుగా పల్లీలు,నువ్వులు కొంచెం వేయించుకుని పొడి చేసి 

పెట్టుకోవాలి.

నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, కరివేపాకు వేసి కొంచెం 

వేయించాలి.

తరువాత కారట్ తురుము, సన్నగా తరిగిన  పుదీనా వేసి  తడి 

పోయేవరకూ బాగా వేయించాలి.

ఇప్పుడు ఉడికించిన అన్నం. ఉప్పు,కారం,పసుపు వేసి  కలపాలి.

చివరగా గరం మసాలా పొడి , పల్లీలు నువ్వుల పొడి వేసి  బాగా 

కలిపి సన్నని సెగపై రెండు  నిమిషాలు  వేయించి దింపెయ్యాలి.

వేయించిన కాజూ తో అలంకరించి వేడిగా సర్వ్ చెయ్యాలి.









Share/Bookmark

Sunday, December 12, 2010

ఓట్స్ ఊతప్పం


ఓట్స్ చాలా మంచిదని అందరికీ తెలుసు.రకరకాలుగా వీటిని మనం 

ఆహారంలో ఉపయోగిస్తూనే ఉంటాము.ఓట్స్ ఉపయోగించి చేసే ఈ 

ఊతప్పం  ఉదయం టిఫిన్ కి చాలా బావుంటుంది.



కావలసిన పదార్ధాలు:

ఓట్స్                   రెండు కప్పులు 

బొంబాయిరవ్వ        రెండు కప్పులు

మైదాపిండి           ఒక కప్పు 

ఉల్లిపాయ             ఒకటి 

మిర్చి                  రెండు

కారట్ తురుము      అర కప్పు 

కరివేపాకు             ఒక రెమ్మ

కొత్తిమీర               అర కప్పు 

ఉప్పు,నూనె           తగినంత 


తయారు చేసే విధానం :

ఒక కప్పు ఓట్స్ ని మిక్సీ లో మెత్తగా పొడి చేసుకోవాలి.

బొంబాయిరవ్వ,ఓట్స్ పొడి,మిగిలిన ఓట్స్ , మైదాపిండి బాగా కలిపి 

నీళ్ళతో దోసెల పిండి లాగ కలుపుకుని, ఒక గంట నాననివ్వాలి.ఎంత 

ఎక్కువ నానితే అంతా బాగా వస్తాయి.

నానిన పిండిలో,ఉల్లి,మిర్చి,కరివేపాకు,కొత్తిమీర అన్నీ సన్నగా తరిగి  

కలపాలి.

చివరగా కారట్ తురుము,ఉప్పు కూడా వేసి కలిపి, పేనంమీద   నూనె 

వేడయ్యాక  కొంచెం మందంగా ఊతప్పం లా వేసుకోవాలి. పలుచగా 

వేస్తే విరిగిపోతాయి.

రెండు వైపులా వేగాక ఏదైనా చట్నీ తో సర్వ్  చెయ్యాలి. వేడిగా తింటే 

బావుంటుంది.
















Share/Bookmark

Friday, December 10, 2010

ఎగ్ మసాలా రైస్

సాధారణంగా మనం ఇంట్లో రైస్ఐటమ్స్ ఎక్కువగానే చేస్తాము. అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనగానే సాస్ లు, అజినిమోటో ఇలా ఎన్నో వేయాలి.  కానీ అవి ఏమీ  అవసరం లేకుండా సింపుల్ గా చేసే ఎగ్ రైస్ ఇది.ఒక పూట కూర వండడానికి బద్ధకించినా నిమిషాల్లో ఇది చేసేయొచ్చు.అలాగే కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో ఇలాంటివి చాలా సుఖం అనిపిస్తుంది.

                            
ఎగ్  మసాలా  రైస్
 





కావలసిన పదార్ధాలు:

ఎగ్స్                     రెండు 

అన్నం                  రెండు  కప్పులు 

మిర్చి                   ఒకటి 

ఉప్పు,కారం            తగినంత 

పసుపు                చిటికెడు 

గరంమసాలాపొడి      ఒక స్పూను 

కొత్తిమీర               కొంచెం 

నూనె                  రెండు  స్పూన్లు 

కరివేపాకు             ఒక రెమ్మ 

అల్లంవెల్లుల్లిముద్డ     అర టీ స్పూను.


తయారు చేసే విధానం :

నూనె వేడికాగానే ఎగ్స్ బ్రేక్ చేసి అందులోకి వేసి ఒక నిమిషం ఉడికించి తరువాత కలిపితే పొడి పొడి గా అవుతుంది.

ఇప్పుడు  అల్లంవెల్లుల్లి ముద్డ, సన్నగా తరిగిన మిర్చి, కరివేపాకు వేసి కొంచెం వేయించాలి.

తరువాత  ఉడికించిన అన్నం,ఉప్పు,కారం,పసుపు, గరం మసాలా పొడి వేసి బాగా కలిపి సన్నని సెగపై  రెండు నిమిషాలు వేయించాలి.

చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి , వేడి వేడిగా తింటే  ఎగ్ మసాలా రైస్ నోరూరిస్తుంది. 













Share/Bookmark

Monday, December 6, 2010

మసాలా పల్లీ - మైక్రోవేవ్ లో

మైక్రోవేవ్ లో చాలా ఈజీగా చేసుకోగల పని నట్స్ వేయించుకోవడం. 
పల్లీలు, కాజూ, బాదం ఇలా ఏది అయిన నిమిషాల్లో వేగిపోతాయి.
అలాగే మసాలా పల్లీ కూడా అంత త్వరగానూ చెయ్యొచ్చు.

                    మసాలా పల్లీ 

                                                                                 
కావలసిన పదార్ధాలు:

పల్లీలు                 ఒక కప్ 
సెనగపిండి            3 స్పూన్లు 
బియ్యంపిండి         1 స్పూను 
ఉప్పు,కారం           తగినంత   
గరంమసాల పొడి    చిటికెడు
వంటసోడా            చిటికెడు
 నూనె                ఒక టీస్పూను 

తయారు చేసే విధానం:

సెనగపిండి, బియ్యంపిండి, తగినంత ఉప్పు కారం, గరం మసాలా పొడి,  వంటసోడా అన్నీ కొంచెం నీటితో పేస్టు లా కలుపుకోవాలి,

ఇందులో పల్లీలు వేసి మిశ్రమం అంతా వాటికి బాగా పట్టేలా మిక్స్ చెయ్యాలి 

ఈ మిశ్రమాన్ని  మైక్రోవేవ్ సేఫ్ బౌల్ లో వేసి ఒక స్పూన్ నూనె వేసి మళ్లీ కలిపి హై లో రెండు నిమిషాలు పెట్టాలి 

ఒకసారి బయటికి తీసి బాగా కలిపి ఇంకో రెండు నిమిషాలు హై లో ఉంచాలి.

తరువాత ఒకసారి కలిపి టెంపరేచర్ తగ్గించి ఒక నిమిషం పెడితే పల్లీలు వేగిపోతాయి.

చల్లారాక బాగా క్రిస్ప్ గా అవుతాయి కాబట్టి మరీ బ్రౌన్ గా వేయించవద్దు.
























Share/Bookmark

Thursday, December 2, 2010

సేమ్యా ఆమ్లెట్




ప్రతి ఉదయం కమ్మని కాఫీ పరిమళంతో ఆరంభమై, తరువాత టిఫిన్, 

లంచ్, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నర్, తిరిగి మళ్లీ  రేపటి 

ఉదయానికి  బ్రేక్ ఫాస్ట్ కి రెడీ చేసుకోడం తోనే రోజంతా గడిచిపోతుంది. 

ఎప్పుడైనా విసుగొచ్చి ఒక పూట బ్రేక్  తీసుకుంటాము ఏమో కానీ, 

జీవితాంతం  ఆడవారికి తప్పని బాధ్యత ఈ వంట. ఎవరు అవునన్నా 

ఎవరు కాదన్నా, ఇది నిజం.
                 
అలాగే ఎన్ని సంవత్సరాలైనా అవే కూరగాయలు.అవి మారవు కదా.

వాటినే అటూ ఇటూ మార్చి, కాంబినేషన్స్ జత చేసి, రుచులు మారేలా 

చేస్తుంటాము.ఒకోసారి  అబ్బ ఏదో ఒకటిలే అనిపిస్తుంది.

ఒకోసారి స్పెషల్ గా కమ్మగా తినాలని అనిపిస్తుంది.

ఏది ఏమైనా ,కొంచెం ఇష్టపడి, కొంచెం కష్టపడితే వంట చాలా ఈజీ. 

కావలసిందల్లా కాస్త ఓపిక ,శ్రద్ధ. అంతే.

వంట చెయ్యడం నాకు చాలా ఇష్టం  

రకరకాల వెరైటీలు చేసి వడ్డించడం సరదా.

అందుకే  నాకు తెలిసినవి, నేను సింపుల్ గా రోజూ ఇంట్లో చేసే వంటలు 

రాయాలని ఈ బ్లాగ్ మొదలుపెడ్తున్నాను. 

ఎవరికైనా  నచ్చి ఉపయోగపడితే సంతోషమే.

ముందుగా మా పిల్లలు ఇష్టంగా తినే  "సేమ్యా ఆమ్లెట్ " మీ కోసం.





                         "సేమ్యా ఆమ్లెట్ " 








కావలసిన పదార్ధాలు :


సేమ్యా              ఒక  కప్

ఉల్లిపాయ          ఒకటి 

పచ్చిమిర్చి        ఒకటి 

ఆలు               ఒకటి చిన్నది 

కారట్              ఒకటి 

టమాటా           ఒక చిన్నది   

కొత్తిమీర           ఒక  చిన్నకట్ట   

కరివేపాకు         నాలుగు  ఆకులు  

ఉప్పు ,కారం       తగినంత 

నూనె              రెండు  టీ సూన్లు

ఎగ్స్                రెండు 

టమాటా కెచప్    రెండు   టేబుల్ స్పూన్లు 



తయారు చేసే విధానం :



ముందుగా వేడినీళ్ళలో సేమ్య ఉడికించి, వార్చి,ఉంచుకోవాలి. 

ఉల్లి, మిర్చి, ఆలూ, టమాటా  కరివేపాకు,కొత్తిమీర  అన్నీ చాలా 

సన్నగా తరగాలి.

ఇందులో కారట్ తురుము, ఉప్పు, కారం  కలిపి మిశ్రమం తయారు 

చేసుకోవాలి.

ఎగ్స్ బీట్ చేసి ఈ మిశ్రమం లో వేసి బాగా కలపాలి.

చివరగా  ఉడికించిన సేమ్యా వేసి  కలపాలి .

పేనం పై నూనె వేడిచేసి,ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగ వెయ్యాలి.ఈ 

కొలతలతో చిన్నవి రెండు అవుతాయి.

మీడియం సెగపై బాగా కాలాక తిరగేసి ,రెండో వైపు కూడా కాల్చాలి.

టమాటా కెచప్ తో సర్వ్ చేస్తే బావుంటుంది.

ఇష్టం ఉన్నవారు ఇంకా బీన్స్,పచ్చి బటాని కూడా ఉడికించి 

కలుపుకోవచ్చు.






Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP