Thursday, March 31, 2011

మేథీ టమాటాపులావ్

ఆకుకూరలు అందులోనూ మెంతికూర చాల మంచిది డయాబెటిక్ 

వాళ్ళని కూడా మెంతి కూర ఏదో ఒక రూపంలో ఎక్కువ తీసుకోమని 

చెప్తారు.కొంచెం మెంతిఆకు,టమాటాలు వేసి కొబ్బరిపాలతో రైస్ వెరైటీ 

చేస్తే రుచి భలే ఉంటుంది.మెంతాకు ఫ్లేవర్, కొబ్బరిపాల రుచి కలిసి 

ఈ పులావ్ చాలా  బావుంటుంది.







కావలసిన పదార్ధాలు;


బియ్యం                                       ఒక గ్లాస్ 

మెంతికూర                                  మూడు కట్టలు

ఆలుగడ్డ                                     ఒకటి   

టమాటాలు                                  రెండు  

ఉల్లిపాయ                                    ఒకటి

మిర్చి                                        మూడు 

కరివేపాకు                                    ఒక రెమ్మ 

కొత్తిమీర                                      ఒక కట్ట

కొబ్బరి పాలు                                ఒక గ్లాస్    

అల్లంవెల్లుల్లి ముద్ద                        రెండు స్పూన్లు 

గరం మసాల పొడి                          రెండు టీస్పూన్స్ 

పసుపు                                       చిటికెడు 

ఉప్పు,నూనె                                  తగినంత 

లవంగాలు  ౩ .చెక్క చిన్న ముక్క,ఇలాచీ ఒకటి 


తయారు చేసే విధానం :


బియ్యం కడిగి ఒక పావుగంట నాననివ్వాలి 

మెంతికూర ఆకులు మాత్రం కడిగి పెట్టుకోవాలి.

పాన్ లో నూనె వేడిచేసి లవంగాలు,చెక్క,ఇలాచి వేసి వాలికలుగా 

తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు,ఆలూముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.

ఇప్పుడు తరిగిన టమాటా వేసి ఉడికిన తరువాత మెంతి ఆకు వేసి 

కొంచెం వేయించాలి.

అల్లంవెల్లుల్లిముద్ద ,పసుపు,గరంమసాలపొడి వేసి కొంచెం వేగాక ఒక 

గ్లాస్ కొబ్బరిపాలు ,మిగిలినవి నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేయాలి.

పాన్ మూతపెట్టి మూడు విజిల్స్ వచ్చాక తీసేయ్యాలి 

ఉల్లిపాయ పెరుగు పచ్చడితో  ఈ పులావ్ బావుంటుంది.











Share/Bookmark

Sunday, March 27, 2011

సింపుల్ ఎగ్ టోస్ట్

చాలా త్వరగా చేయగల స్నాక్ ఇది స్కూల్ నుండి రాగానే పిల్లలకి ఇస్తే

చాలా ఇష్టంగా తింటారు.ఎందుకోగానీ బ్రెడ్ ఆమ్లెట్ కంటే ఇది ఎక్కువగా 

ఇష్టపడతారు.







కావలసిన పదార్ధాలు :

బ్రెడ్                             నాలుగు స్లైసులు 

ఎగ్స్                             రెండు 

ఉల్లిపాయ                      ఒకటి 

మిర్చి                          రెండు 

కొత్తిమీర                       పావుకప్పు 

ఉప్పు,కారం                    తగినంత 

నెయ్యి                        రెండు స్పూన్లు 


కారట్ తురుము కానీ,తురిమిన చీజ్ కానీ,పనీర్ కానీ ఇష్టాన్ని బట్టి 

ఏదో ఒకటి కలుపుకోవచ్చు,నేను కొంచెం చీజ్ తురుము కలిపాను 


తయారు చేసే విధానం:

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కొత్తిమీర,తగినంత ఉప్పు,కారం అన్నీ ఒక 

బౌల్ లో వేసి కలపాలి.

ఎగ్స్ బ్రేక్ చేసి ఇందులో వేసి కొంచెం బీట్ చెయ్యాలి.

చివరిగా కారట్,పనీర్,చీజ్ ఏదో ఒకటి తురుము వేసి కలపాలి.

ఇప్పుడు ఒకో బ్రెడ్ స్లైస్ నీ ఈ మిశ్రమంలో ముంచి రెండువైపులా పట్టించి

జాగ్రత్తగా పెనంపై పెట్టాలి 

కొంచెం నెయ్యివేసి రెండు వైపులా మంచి కలర్ వచ్చేవరకూ వేయించి 

టమాట కెచప్ తో ఇస్తే బావుంటుంది.


Share/Bookmark

Thursday, March 24, 2011

మామిడికాయ, కొబ్బరి పచ్చడి



పచ్చిమామిడి.ఆ పులుపు తలచుకుంటేనే నోరూరుతుంది.ఈ ఏడాది  

తొలి మామిడికాయ.భలే పుల్లగా ఉంది.మామిడికాయతో ఎలా పచ్చడి

చేసినా ఇష్టమే.చేసీచేసీ నాకు విసుగురావాలే కానీ రోజూ చేసినా 

తింటారు మా ఇంట్లో. అందుకే మొదటగా కొబ్బరితో కలిపి ఈ పచ్చడి

చేశాను.





కావలసిన పదార్ధాలు 

మామిడికాయ                     ఒకటి 

పచ్చికొబ్బరితురుము            ఒక కప్పు 

ఎండుమిర్చి                         పది 

ఉప్పు                               తగినంత 

జీలకర్ర                             ఒక స్పూన్ 

వెల్లుల్లి రెబ్బలు                    ఆరేడు

కరివేపాకు                         రెండు రెమ్మలు 

నూనె                             మూడు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి  

తయారు చేసే విధానం:

ఒక స్పూన్ నూనె వేడిచేసి ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి.

ఈ ఎండుమిర్చి,ఉప్పు,వెల్లుల్లిరెబ్బలు జీలకర్ర  మిక్సీలో గ్రైండ్ చెయ్యాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు,కొబ్బరితురుము 

వేసి అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలిపితే పుల్లగా,కమ్మగా 

పచ్చడి రెడీ అవుతుంది.

వేడివేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే .... ఇక వదిలిపెట్టరు


Share/Bookmark

Sunday, March 20, 2011

చేపల పులుసు

చేపలపులుసు అనగానే నోరు ఊరిపోతుంది.చికెన్ తరువాత నాన్ వెజ్  

ప్రియులు ఇష్టపడేది చేపల పులుసు అంటే అతిశయోక్తి కాదు. కొంచెం

స్పైసీగా,పుల్లపుల్లగా,కమ్మగా ఉండే ఈ పులుసు పెట్టడం ఎలాగో 

చూద్దామా 





కావలసిన పదార్ధాలు :

చేప ముక్కలు                     కేజీ 

ఉల్లిపాయలు                       మూడు

మిర్చి                               నాలుగు 

కరివేపాకు                         రెండు రెమ్మలు 

కొత్తిమీర                           ఒక కట్ట 

ఉప్పు,కారం                       తగినంత

పసుపు                            అర స్పూన్ 

నూనె                               ఒక కప్పు 

చింతపండు పులుసు              ఒక కప్పు 

అల్లం                                రెండు అంగుళాల ముక్క 

వెల్లుల్లిరెబ్బలు                      పది 

ఎండుకొబ్బరి                       చిన్న ముక్క 


మసాలాదినుసులు 

లవంగాలు                           ఎనిమిది 

దాల్చిన చెక్క                       రెండు ముక్కలు 

జీలకర్ర                               రెండు స్పూన్లు 

ధనియాలు                         రెండు స్పూన్లు 

గసగసాలు                          రెండు స్పూన్లు 


తయారు చేసే విధానం:

ముందుగా చేపముక్కలను శుభ్రంచేసి, కొంచెం ఉప్పు,కారం,పసుపు

ఒక స్పూన్ నూనె వేసి కలిపి ఉంచాలి.

మసాలా దినుసులు  అన్నీ మెత్తగా పొడి కొట్టి ఉంచుకోవాలి 

అల్లం, వెల్లుల్లి, ఎండుకొబ్బరి కొంచెం నీటితో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

వెడల్పుపాన్ లో నూనె వేడిచేసి తాలింపు వేసి,కరివేపాకు,సన్నగా 

తరిగిన ఉల్లిపాయలు,చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించాలి.

బాగా వేగిన తరువాత అల్లంవెల్లుల్లి కొబ్బరి ముద్ద వేసి వేయించాలి. 

పచ్చివాసన పోయిన తరువాత మసాలాపొడి వేసి,ఉప్పు,పసుపు ,

కారం వేసి నూనె తేలేవరకు వేయించాలి.

ఇప్పుడు చేపముక్కలు వేసి రెండు నిమిషాల తరువాత జాగ్రత్తగా 

వాటిని ఒక్కొక్కటిగా తిరగెయ్యాలి.

రెండు నిమిషాల తరువాత చిక్కగా తీసిన చింతపండు పులుసు పోసి 

ఉడికించాలి.

మధ్య మధ్యలో పాన్ ని  మొత్తంగా తిప్పుతూ సన్నని సెగపై పులుసు 

చిక్కబడి నూనె తేలేవరకూ ఉడికించాలి. గరిటతో తిప్పకూడదు.

ముక్కలు చితికిపోతాయి 

చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి రెండు నిమిషాల తరువాత 

దించెయ్యాలి.

చల్లారిన తరువాత ఇంకా రుచిగా ఉండే ఈ పులుసు రెండు రోజులైనా 

అదే రుచితో ఘుమఘుమలాడుతూ ఉంటుంది



Share/Bookmark

Thursday, March 17, 2011

పులిహోర

చింతపండు పులిహోర తెలియని,చేయనివారు ఉండరు.కాకపోతే 

ఒక్కో ప్రాంతంలో ఒక్కో పధ్ధతిలో చేస్తారు.అలాగే నేను చేసేది కొంచెం 

వేరుగా ఉంటుంది.అందుకే బ్లాగ్ లో పెడ్తున్నాను.






కావలసిన పదార్ధాలు :


బియ్యం                           ఒక గ్లాస్ 

చింతపండు పేస్ట్                 తగినంత 

శనగపప్పు                        పావు కప్పు 

మిర్చి                              ఎనిమిది 

అల్లం                               చిన్న ముక్క 

కరివేపాకు                         మూడు రెమ్మలు

ఉప్పు,పసుపు,నూనె 

తాలింపుకు 

పల్లీలు,శనగపప్పు.మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి 

తయారు చేసే విధానం:

బియ్యం,శనగపప్పు కలిపి కడిగి తగినన్ని నీళ్ళు,పసుపు వేసి అన్నం 

వండుకోవాలి 

ఉడికిన అన్నాన్ని పళ్ళెంలో వేసి తగినంత ఉప్పు,చింతపండు పేస్ట్ వేసి 

అన్నానికి పట్టించి ఆరనివ్వాలి.

తాలింపువేసి పప్పులు,ఆవాలు,ఎండుమిర్చి,పల్లీలు అన్నీవేగిన 

తరువాత కరివేపాకు,పచ్చిమిర్చి,సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసి 

కొంచెం వేయించి ఈ తాలింపును అన్నంలో కలపాలి.

కొంచెం ఊరాక తింటే కరకరలాడే పప్పులతో కమ్మని పులిహోర 

నోరూరిస్తుంది.


Share/Bookmark

Sunday, March 13, 2011

కాజూ బాదం కస్టర్డ్ ఖీర్

వేసవి వచ్చేసింది కదా చల్లచల్లగా తినాలనిపిస్తుంది.చాలా సింపుల్ గా 

పదినిమిషాల్లో అయిపోయే  ఖీర్ ఇది.డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కనుక 

మంచిది.చేసి ఫ్రిజ్ లోఉంచుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 

ఇవ్వొచ్చు 






కావలసిన పదార్ధాలు :


పాలు                       అర లీటరు 

కాజూ                        పది 

బాదం                      పది 

పంచదార                 ఒక కప్పు 

కస్టర్డ్ పౌడర్              ఒక టేబుల్ స్పూను 

సన్న సేమ్యా             అర కప్పు 

నెయ్యి                      ఒక స్పూన్ 

ఇలాచీ పొడి               అర స్పూన్ 


తయారు చేసే విధానం :


ముందుగా నెయ్యి వేడిచేసి సన్నసేమ్యాని వేయించి తీసుకోవాలి.ఇది 

లేనివారు మామూలు సేమ్యా అయినా వెయ్యొచ్చు 

కాజూ బాదం మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పి తీసేయ్యాలి. మరీ పౌడర్ లా 

కాకుండా  పలుకుల్లా ఉంటేనే బాగుంటుంది.

పాలు పంచదార కలిపి మరిగించి,పంచదార కరిగాక సేమ్యా వేసి ఒక 

పొంగురాగానే,ఒక స్పూన్ పాలల్లో కలిపిన కస్టర్డ్ పౌడర్ వెయ్యాలి.

ఒక నిమిషం తరువాత కాజూ,బాదం వేసి కొంచెం చిక్కబడేవరకు ఉంచి

ఇలాచీ పొడి వేసి దించెయ్యాలి 

చల్లారాక ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చెయ్యాలి 

ఇందులో ఇష్టం ఉన్నవారు ఖర్జూర పళ్ళు కూడా చిన్న ముక్కలుగా 

కట్ చేసి వేసి ఇవ్వొచ్చు.

లేదా ఇచ్చేముందు గ్రేప్స్,దానిమ్మగింజలు ఇలాంటి ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా 

కలిపి ఇవ్వొచ్చు .




Share/Bookmark

Saturday, March 12, 2011

బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై

బాయిల్డ్ ఎగ్స్ తో చేసే ఈజీ కూర ఇది.ఉల్లిపాయలు,గుడ్లు ఉంటే చాలు 

ఈ కూర రెడీ అయిపోతుంది.అన్నంలోకి,చపాతీలోకి కూడా 

బావుంటుంది.




కావలసిన పదార్ధాలు:

ఎగ్స్                          రెండు

ఉల్లిపాయలు               రెండు పెద్దవి

మిర్చి                         రెండు  

అల్లంవెల్లుల్లి పేస్ట్           అర టీ స్పూన్

గరం మసాల పొడి          అర స్పూన్

ఉప్పు,కారం                   తగినంత

పసుపు                       కొంచెం 

నూనె                          మూడు టేబుల్ స్పూన్లు 

కొత్తిమీర                       కొంచెం

తాలింపుకు  శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిర్చి  


తయారు చేసే విధానం :


నూనె వేడిచేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు,మిర్చి,

కరివేపాకు వేసి సన్నని సెగపై వేయించాలి.

ఉల్లిపాయ బాగా వేగిన తరువాత అల్లంవెలుల్లి పేస్ట్,ఉప్పు,కారం,పసుపు,

ఉడికించిన గుడ్లు వేసి రెండు నిమిషాలు వేయించి గరంమసాల పొడి,

కొత్తిమీర చల్లాలి.

బాగా కలిపి మరో రెండు నిమిషాలు  ఉంచి దింపెయ్యాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి 




          
 


Share/Bookmark

Monday, March 7, 2011

పాలకూర పకోడీలు

అత్యంత సులభంగా,పదినిమిషాల్లో అయిపోయే స్నాక్స్ అంటే పకోడీలే.

అందరూ ఇష్టంగా తినేవి కూడా ఇవే.వీటికి అప్పుడప్పుడు ఆకుకూర 

జోడిస్తే రుచికి రుచి, పిల్లలకి వెరైటీ.అలా పాలకూరతో చేసిన ఈ 

పకోడీలు చాలా బావుంటాయి.






కావలసిన పదార్ధాలు :

పాలకూర                         మూడు కట్టలు 

ఉల్లిపాయ                         ఒకటి 

మిర్చి                               నాలుగు 

అల్లం                               చిన్న ముక్క 

కరివేపాకు                        ఒక రెమ్మ 

కొత్తిమీర                          ఒక చిన్నకట్ట 

శనగపిండి                       ఒక కప్పు 

వరిపిండి                         రెండు టేబుల్ స్పూన్లు 

ఉప్పు                               తగినంత 

వంటసోడా                       చిటికెడు 

నూనె , టమాటాసాస్ 

తయారుచేసే విధానం:

పాలకూర కడిగి సన్నగా తరిగి ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

ఇందులోవాలికలుగా తరిగిన ఉల్లిపాయ,సన్నగా తరిగిన మిర్చి,అల్లం,

కొత్తిమీర,కరివేపాకు కలపాలి 

శనగపిండి,వరిపిండి,ఉప్పు,సోడా వేసి కొంచెం నీటితో ముద్దగా 

చేసుకుని నూనె కాగాక పకోడీలు వేసుకోవాలి.

వేగాక  టమాటాసాస్ తో వేడివేడిగా తింటే కరకరలాడే  కమ్మని 

పాలకూర  పకోడీలు  ఊరిస్తాయి.


Share/Bookmark

Friday, March 4, 2011

సేమ్యా సగ్గుబియ్యం పాయసం

పండుగలు అనగానే ముందు గుర్తొచ్చేది పాయసమే.ఎన్నో వెరైటీల 

పాయసాలు ఉన్నా సేమ్యా సగ్గుబియ్యం వేసి చేసే ఈ పాయసం చాలా 

ట్రెడిషనల్.ఇది ఆరోగ్యానికి కూడామంచిది.పుట్టినరోజు అంటే మాఇంట్లో 

ముందు ఈ పాయసమే స్పెషల్.ఆ తరువాతే కేక్స్ అయినా స్వీట్స్ 

అయినా





కావలసిన పదార్ధాలు :

పాలు                           అర లీటరు 

సగ్గుబియ్యం                    ఒక కప్పు 

సేమ్యా                          ఒక కప్పు 

నెయ్యి                           రెండు స్పూన్లు 

బెల్లం                              ఒక కప్పు 

పంచదార                        అర కప్పు

ఇలాచి పొడి                    ఒక స్పూన్ 

కాజూ,కిస్మిస్     


తయారు చేసే విధానం 

సగ్గుబియ్యం కడిగి కొంచెం నీరు పోసి నానబెట్టుకోవాలి 

ఒక స్పూన్ నెయ్యి వేడి చేసి కాజూ,కిస్మిస్ వేయించి తీసుకోవాలి.ఇంకో 

స్పూన్ నేతిలో సేమ్యా వేయించి తీసుకోవాలి 

బెల్లం,పంచదార కొంచెం నీరుపోసి వేడిచేసి రెండూ పూర్తిగా కరిగి 

బబుల్స్ వచ్చేవరకూ ఉడికించి వడపోసి ఉంచాలి 

పాలు కాచి పొంగు వచ్చేటప్పుడు సగ్గుబియ్యం వేసి ఉడికించాలి.ఇవి 

కొంచెం ఉడికాక వేయించిన సేమ్యావేసి ఉడికిన తరువాత ఇలాచిపొడి,

వేయించిన కాజూ,కిస్మిస్ వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

చల్లారిన తరువాత బెల్లంపాకం కలిపితే కమ్మని పాయసం రెడీ 

అవుతుంది. 

నోట్: పాయసం వేడిగా ఉన్నప్పుడు  పాకం కలిపితే పాలు విరిగినట్టు 

అవుతుంది,అందుకని చల్లారిన తరువాత మాత్రమే కలపాలి.


Share/Bookmark

Wednesday, March 2, 2011

కాబేజ్ పకోడీ కూర

కాబేజ్ అనగానే ఇంట్లో అబ్బా అంటారు.ఎప్పుడూ ఒకే రకంగా పప్పు,

కొబ్బరి ఇవే వేసి వండినా బోర్ అనిపిస్తుంది.అందుకే కాబేజ్ తోనే పకోడీ 

వేసి కూర చేస్తే చాలా నచ్చింది.పప్పు,సాంబారు వీటికి సైడ్ డిష్ గా 

బావుంటుంది.






కావలసిన పదార్ధాలు:

 పకోడీ కోసం 

కాబేజ్                          రెండు కప్పులు 

శనగపిండి                     ఒక కప్పు 

వరిపిండి                        రెండు టేబుల్ స్పూన్లు 

ఉప్పు                            తగినంత 

వంట సోడా                     చిటికెడు 

మిర్చి                            రెండు 

నూనె  

కాబేజ్ ను సన్నగా తరిగి ఒక బౌల్ లో అన్నీ వేసి కొంచెం నీటితో కలిపి 

చిన్నచిన్న పకోడీలు వేసి డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి.

ఇందులోనే  ఉల్లిపాయ,అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాల పొడి,కొత్తిమీర 

వేసి పకోడీలు  కొంచెం పెద్దవి వేసుకుంటే స్నాక్స్ గా తినొచ్చు.



                         
కూరకి :

ఉల్లిపాయ                        ఒకటి 

మిర్చి                             రెండు 

కరివేపాకు                       ఒక రెమ్మ 

కొత్తిమీర                          అర కట్ట 

అల్లంవెల్లుల్లి ముద్ద            అర టీ స్పూన్

గరంమసాల పొడి               ఒక టీ స్పూన్

టమాటా ప్యూరీ                  రెండు స్పూన్లు (లేదా ఒక టమాటా)

నూనె                              రెండు స్పూన్లు

ఉప్పు                                తగినంత  

పసుపు                           కొంచెం 

కారం                               ఒక స్పూన్ 

తాలింపుకు                      శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి   

తయారు చేసే విధానం:

నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి ,మిర్చి,కరివేపాకు 

వేసి వేయించాలి .

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేగిన తరువాత టమాటప్యూరీ,పసుపు

 ఉప్పు,కారం వేసి వేగిన తరువాత కాబేజ్ పకోడీలు వేసి బాగా కలిపి 

కొంచెం వేయించాలి.

చివరగా గరంమసాల పొడి,కొత్తిమీర వేసి కలిపి రెండు నిమిషాలు ఉంచి 

దింపెయ్యాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లితే వెరైటీ కూర రెడీ అవుతుంది.

టమాటా ప్యూరీ వలన క్రిస్ప్ గా ఉన్న పకోడీలు కొంచెం మెత్తబడి 

కూర బావుంటుంది.


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP