Saturday, March 31, 2012

డబల్ కా మీటా

చాలా పాపులర్ హైదరాబాదీ స్వీట్ ఇది.ఈ స్వీట్ ను ఒక్కొక్కరు ఒక్కో 

పధ్ధతిలో చేస్తారు.ఎలా చేసినా చాలా రుచిగా ఉంటుంది.నెయ్యి కాస్త 

ఎక్కువే పడుతుంది కానీ ఎప్పుడన్నా ఒకసారి తింటాము కనుక పర్లేదు.







కావలసిన పదార్ధాలు:


బ్రెడ్ స్లైసెస్                          నాలుగు 

పంచదార                           ఒక కప్పు 

పాలు                              రెండు కప్పులు 

నెయ్యి,ఇలాచీ పొడి ,కాజూ,కిస్మిస్ 


తయారు చేసే విధానం:


బ్రెడ్ స్లైసెస్ ను ఎండలో కానీ,ఫ్యాన్ గాలికి కానీ ఆరబెట్టాలి.వాటిలో 

తడి అంతా పోయి డ్రైగా అవుతాయి.ఇలా చేయడం వలన నెయ్యి 

కొంచెం తక్కువ పీల్చుకుంటాయి. 

వీటిని నేతిలో వేయించి తీసుకుని పాలలో వేసి నాననివ్వాలి.

పంచదారలో కొంచెం నీళ్ళు పోసి పాకం వచ్చాక ఇలాచీ పొడివేసి కలిపి 

పాలల్లో నానిన బ్రెడ్ స్లైసెస్ ను వేయాలి.మొత్తం ఉడికి నెయ్యి బయటికి 

వస్తుండగా స్టవ్ ఆఫ్ చెయ్యాలి.మిశ్రమం ఉడికేటప్పుడు ఎక్కువగా 

గరిటతో కలపకూడదు.అలా చేస్తే హల్వాలాగా అయిపోతుంది.బ్రెడ్ 

చిన్నచిన్న పీసెస్ గా ఉంటేనే బావుంటుంది.

ఒక బౌల్ లోకి తీసుకుని నేతిలో వేయించిన కాజూ,కిస్మిస్ లతో 

అలంకరించుకోవాలి.


Share/Bookmark

Thursday, March 29, 2012

మామిడి లస్సీ

కాస్త ఎండలు మొదలైతే చాలు చల్లచల్లగా తాగాలనిపిస్తుంటుంది కూల్ 

డ్రింక్స్ బదులు వీలైనంతవరకూ ఫ్రూట్స్ తో ఏమి చేసినా బావుంటాయి.

చాలా తక్కువ పదార్ధాలతో రెండు నిమిషాల్లో ఈ లస్సీ చేసెయ్యొచ్చు.






కావలసిన పదార్ధాలు:



మామిడి ముక్కలు                  ఒక కప్పు 

ఫ్రెష్ పెరుగు                         ఒక కప్పు 

పంచదార                            తగినంత 

చల్లని నీరు 



తయారు చేసే విధానం:


మామిడిముక్కలు,తగినంత పంచదార కలిపి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.

ఇప్పుడు పెరుగు వేసి బ్లెండ్ చెయ్యాలి.

చివరగా చల్లని నీళ్ళు పోసి ఒకసారి బ్లెండ్ చెయ్యాలి.ఇష్టం ఉంటే నీరు 

బదులు ఐస్ క్యూబ్స్ వాడొచ్చు.

గ్లాస్ లో పోసి పైన మామిడి ముక్కలు వేస్తే రుచికరమైన లస్సీ  

తయారవుతుంది.


Share/Bookmark

Tuesday, March 27, 2012

కరివేపాకు పచ్చడి

ఒకోసారి ఇంట్లో చాలా కరివేపాకు ఉంటుంది.ఊరికే ఎండిపోయి 

పాడైపోతుంది.అలాంటప్పుడు ఈ పచ్చడి చేసుకుంటే అన్నంలోకి చాలా 

బావుంటుంది.సాధారణంగా కూరల్లో తినకుండా ఏరి పక్కన పెట్టేస్తాము.

కాబట్టి అప్పుడప్పుడూ ఇలా పచ్చడి చేసుకుని తింటే మంచిది కూడా.






కావలసిన పదార్ధాలు:


కరివేపాకు                      ఒక కప్పు 

ఎండుమిర్చి                     ఆరేడు 

జీలకర్ర                         ఒక స్పూన్ 

వెల్లుల్లి                          నాలుగు రెబ్బలు

చింతపండుపేస్ట్                 అర స్పూన్  

లేదా (మామిడితురుము పావుకప్పు)

నూనె,ఉప్పు,తాలింపు దినుసులు 



తయారు చేసే విధానం:


కరివేపాకు కడిగి కొంచెం ఆరనివ్వాలి.

ఒక టీస్పూన్ నూనె వేడిచేసి ఎండుమిర్చి దోరగా వేయించి తీయాలి.

మరొక స్పూన్ నూనె వేసి కరివేపాకును వేయించుకోవాలి.

మిర్చి,ఉప్పు,జీలకర్ర,వెల్లుల్లి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు కరివేపాకు,మామిడితురుము కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే 

పచ్చడి రెడీ.

ఒక స్పూన్ నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలిపి వేడివేడి

అన్నంలో నెయ్యి వేసుకుని తింటే బావుంటుంది. 

మామిడికాయ ఉంది కదా అని నేను చింతపండు బదులు ఈసారి 

మామిడితురుము వేసాను.మాములుగా అయితే ఒక అర స్పూన్ 

చింతపండు పేస్ట్ వేస్తే సరిపోతుంది.


Share/Bookmark

Saturday, March 24, 2012

పనీర్ -కోకోనట్ ఖీర్

పనీర్,పచ్చికొబ్బరి రెండూ అందరికీ ఇష్టమే.ఈ రెండూ కలిపి చేసే ఈ 

ఖీర్ కొంచెం బాసుంది రుచితో బావుంటుంది.







కావలసిన పదార్ధాలు:



పాలు                           అరలీటరు 

పనీర్                           ఒక కప్పు 

కొబ్బరితురుము              అర కప్పు

పంచదార                      ఒక కప్పు 

ఇలాచీ పొడి                   అర స్పూన్

శాఫ్రాన్                         కొద్దిగా

నెయ్యి,కాజు,బాదాం,కిస్మిస్   


తయారు చేసే విధానం:



పాలను కొంచెం మరిగించి ఇందులో పనీర్ తురుము,కొబ్బరితురుము 

వేసి ఉడికించాలి.

పంచదార వేసి కలిపి సిమ్ లో ఉంచి మిశ్రమం చిక్కగా అయ్యేవరకు 

ఉడికించి ఇలాచీపొడి,ఒక స్పూన్ పాలలో నానబెట్టిన సాఫ్రాన్ వేయాలి.

ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి కాజు,కిస్మిస్ వేయించాలి.

ఒక బౌల్ లోకి తీసుకుని కాజు,కిస్మిస్,బాదాం తురుము వేయాలి.

ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే చాలా బావుంటుంది.

ఇష్టం లేకపోతే కొబ్బరి వేయకుండా పనీర్ ఒక్కటే వాడొచ్చు.

ఖీర్ బాగా చిక్కగా కావాలంటే కొంచెం కోవా వేసుకోవచ్చు.
 


Share/Bookmark

Wednesday, March 21, 2012

పనీర్ మసాలా గ్రేవీ

పనీర్ అంటేనే పిల్లలు చాలా ఇష్టపడతారు.ఈ కర్రీ  దాదాపు అందరికీ 

తెలిసిందే.అయితే హైరానా పడకుండా చాలా సింపుల్ గా చేసే పధ్ధతి

ఇది.






కావలసిన పదార్ధాలు:


పనీర్                                200  గ్రాములు 

టమాటాలు                          మూడు 

ఉల్లిపాయ                            ఒకటి 

పచ్చిమిర్చి                          రెండు 

జీడిపప్పు                             పది 

కసూరి మేతి                       ఒక టీ స్పూన్ 

అల్లంవెల్లుల్లి ముద్ద                ఒక టీ స్పూన్ 

గరంమసాలా పొడి                ఒక టీ స్పూన్  

కొత్తిమీర                            కొద్దిగా 

మీగడ                             ఒక టేబుల్ స్పూన్ 

నూనె,నెయ్యి,షాజీర,యాలకులు 


తయారు చేసే విధానం:


ఉల్లిపాయ ముక్కలు,టమాట ముక్కలు,జీడిపప్పు,మిర్చి,కసూరి 

మేతి అన్నీ కలిపి ఉడికించుకోవాలి.మైక్రోవేవ్ లో అయితే ఒక బౌల్ లో 

వేసి కొంచెం నీళ్ళు పోసి మూడు నిముషాలు హైలో పెట్టాలి.

కొంచెం చల్లారాక వీటిని గ్రైండ్ చేసుకోవాలి.

పాన్ లో ఒక స్పూన్ నూనె,ఒక స్పూన్ నెయ్యి వేడిచేసి షాజీర, రెండు

యాలకులు వేయాలి.

అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి, గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసి 

ఉడికించాలి.

కొద్దిగా దగ్గరవుతుండగా పనీర్ ముక్కలు వేసి కలిపి పాలమీద మీగడ

వేయాలి.మీగడ లేకపోతే ఒక పావుకప్పు పాలు అయినా వాడొచ్చు.

చివరగా గరంమసాలా పొడి,ఒక చిటికెడు పంచదార(ఇష్టమైతే) వేసి 

గ్రేవీ చిక్కబడ్డాక కొత్తిమీర చల్లాలి.

పంచదార వేయడం వలన టమాటా పులుపు కొంచెం తగ్గుతుంది.

ఇష్టం ఉంటే నూనె,నెయ్యి బదులు బటర్ వాడుకోవచ్చు. 

రోటీ,చపాతీ,పులావ్ ఇలా దేనిలోకైనా ఈ కూర బావుంటుంది. 

చిన్నటిప్: సర్వ్ చేసే ముందు ఒక్క పది సెకన్లు మైక్రోవేవ్ లో వేడిచేస్తే 

పనీర్ ముక్కలు చాలా సాఫ్ట్ గ ఉంటాయి.


Share/Bookmark

Monday, March 19, 2012

కారట్ - కొత్తిమీర పచ్చడి

కారట్ తో ఎక్కువగా స్వీట్స్,సలాడ్స్,కూరలు ఇవే చేస్తుంటాము.

కారట్,కొత్తిమీర,కొంచెం పచ్చికొబ్బరి కలిపి చేసే ఈ పచ్చడి వెరైటీగా 

ఉంటుంది.కొంచెం తీయగా,కొంచెం కారంగా అన్నంలోకి,టిఫిన్స్ లోకి 

కూడా బావుంటుంది.







కావలసిన పదార్ధాలు:


కారట్                              నాలుగు 

పచ్చిమిర్చి                        ఆరేడు 

కొత్తిమీర                           ఒక కట్ట 

కొబ్బరితురుము               రెండు టేబుల్ స్పూన్స్

వెల్లుల్లి రెబ్బలు                   రెండు 

జీలకర్ర                          పావుస్పూన్ 

చింతపండు పేస్ట్                కొద్దిగా

కరివేపాకు                      ఒక రెమ్మ 

ఉప్పు,నూనె,తాలింపు దినుసులు   


తయారు చేసే విధానం:


ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి పచ్చిమిర్చి,కారట్ తురుము,

కొత్తిమీర వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించాలి.

ముందుగ మిర్చి,వెల్లుల్లిరెబ్బలు,జీలకర్ర,ఉప్పు,చింతపండు గ్రైండ్ 

చేసుకోవాలి.

ఇప్పుడు కారట్,కొత్తిమీర వేసి గ్రైండ్ చెయ్యాలి.

చివరగా కొబ్బరి తురుము వేసి ఒకసారి గ్రైండ్ చెయ్యాలి.

ఒక టీ స్పూన్ నూనె వేడిచేసి తాలింపు వేసి పచ్చడిలో కలపాలి.

ఇడ్లీ,దోశ ఇలాంటి టిఫిన్స్ లోకి అయితే ఈ పచ్చడిలో కొంచెం ఫ్రెష్ 

పెరుగు కలిపి సర్వ్ చేస్తే బావుంటుంది 
 


Share/Bookmark

Friday, March 16, 2012

కొత్తిమీర - మామిడి రైస్

మామిడికాయతో రైస్ అంటే పులిహోరే గుర్తొస్తుంది.ఇంట్లో 

కూరగాయలు అయిపోవడంతో ఉన్న ఈ రెండింటితో చేసిన ప్రయోగం 

ఇది.మామిడికాయ పులుపు,కొత్తిమీర ఫ్లేవర్ తో రుచి బావుంది.




 


కావలసిన  పదార్ధాలు :


అన్నం                              రెండు కప్పులు 

మామిడికాయ                      ఒకటి 

కొత్తిమీర                             ఒక కట్ట 

కొబ్బరితురుము                  రెండు టేబుల్ స్పూన్స్ 

ఉల్లిపాయ                          ఒకటి 

పచ్చిమిర్చి                        రెండు 

అల్లం                             చిన్నముక్క 

కరివేపాకు                        ఒక రెమ్మ

గరంమసాలా పొడి               అర స్పూన్ 

కాజూ,ఉప్పు,కారం,పసుపు,నూనె,తాలింపు దినుసులు 



తయారు చేసే విధానం:



కొత్తిమీర,కొబ్బరితురుము,అల్లం,మిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ 

చేసుకోవాలి.

నూనె వేడిచేసి తాలింపు వేసి కాజూ,కరివేపాకు వేయించాలి.

సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి,గ్రైండ్ చేసిన పేస్ట్

వేయాలి.పచ్చిదనం పోయేవరకూ వేగనిచ్చి మామిడితురుము 

వేయాలి.

పసుపు,కారం వేసి కలిపి వేయించి చివరగా అన్నం,తగినంత ఉప్పు,

గరంమసాలా పొడి వేసి బాగా కలపాలి.

సిం లో పెట్టి రెండు మూడు నిముషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

పుల్లపుల్లగా నోరూరించే మామిడి రైస్ రెడీ అవుతుంది.

నోట్ : మామిడికాయ బాగా పుల్లగా ఉంటే సగం తురుము వేస్తే 

సరిపోతుంది.






  


Share/Bookmark

Tuesday, March 13, 2012

సేమ్యా కర్డ్ బాత్

వేసవి ఉదయాల్లో చల్లగా,కమ్మగా ఉండే ఐటం ఇది.చాలా ఈజీగా 

చేసుకోవచ్చు.రెగ్యులర్ టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు వెరైటీగా ఉంటుంది.







కావలసిన పదార్ధాలు:


సేమ్యా                     ఒక కప్పు 

పెరుగు                    ఒక కప్పు 

ఉల్లిపాయ                  ఒకటి 

పచ్చిమిర్చి                ఒకటి  

కారట్                      ఒకటి

అల్లం                     చిన్నముక్క 

కొత్తిమీర                  కొంచెం 

కరివేపాకు                ఒక రెమ్మ 

ఉప్పు                      తగినంత 

కాజూ,నూనె 

తాలింపుకు శనగపప్పు,ఆవాలు,జీలకర్ర,మిరియాలు,ఎండుమిర్చి



తయారు చేసే విధానం:


ఒక గిన్నెలో నీళ్ళు మరిగించి సేమ్యా వేసి ఉడికించాలి.ఉడకగానే 

జల్లెడలో వార్చికొంచెం చల్లని నీళ్ళు పోస్తే సేమ్యాముద్ద కాకుండా

పొడిపొడిగా వస్తుంది

పెరుగును కొంచెం బీట్ చేసి ఉడికించిన సేమ్యా,తగినంత ఉప్పు వేసి 

కలపాలి.

ఇందులో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం, కారట్ తురుము, 

కొత్తిమీర వేసి కలపాలి.

ఒక స్పూన్ నూనె వేడిచేసి తాలింపు వేసి సేమ్యా మిశ్రమంలో కలపాలి.

ఉల్లిముక్కలు,కారట్ తురుము వేయడంతో క్రంచీగా బావుంటుంది.ఇవి 

ఇష్టం లేకపోతే ప్లెయిన్ గా అయినా చేసుకోవచ్చు.

పిల్లలకి వీటి బదులు ద్రాక్ష, దానిమ్మ ఇలా ఫ్రూట్స్ కలిపి కూడా 

ఇవ్వొచ్చు.అలాగే కొంచెం పచ్చికొబ్బరి తురుము వేసినా బావుంటుంది.






Share/Bookmark

Tuesday, March 6, 2012

బ్రెడ్ దోశ

ఇంట్లో ఎప్పుడూ ఉండే బ్రెడ్ తో చేసుకునే ఈ దోశ పిల్లలకి వెరైటీగా 

ఉంటుంది.చాలా త్వరగా అయిదు నిమిషాల్లో దోశ మిశ్రమం రెడీ 

చేసేసుకోవచ్చు.






కావలసిన పదార్ధాలు:


బ్రెడ్ స్లైసెస్                       ఆరు 

బొంబాయిరవ్వ                అర కప్పు 

బియ్యంపిండి                  రెండు టేబుల్ స్పూన్స్ 

ఉల్లిపాయ                       ఒకటి 

పచ్చిమిర్చి                     రెండు

కారట్ తురుము              రెండు స్పూన్స్ 

అల్లం,కొత్తిమీర,కరివేపాకు,నూనె,ఉప్పు 


తయారు చేసే విధానం:


బ్రెడ్ ను చిన్న ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చెయ్యాలి.

ఇందులో రవ్వ,బియ్యంపిండి వేసి కొంచెం నీళ్ళుపోసి మెత్తగా గ్రైండ్ 

చేసుకోవాలి   

ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని తగినంత ఉప్పు,నీళ్ళు పోసి 

కలిపి దోసెల పిండిలా చేసుకుని ఒక అరగంట నాననివ్వాలి.

ఇందులో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,అల్లం,కొత్తిమీర,కరివేపాకు,

కారట్ తురుము అన్నీ వేసి కలపాలి 

నాన్ స్టిక్ తవా పైన ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న దోసెలు పోసుకుని 

నూనె వేసి రెండువైపులా కాల్చాలి.

వేడివేడిగా ఏదైనా చట్నీతో కానీ,సాస్ తో కానీ సర్వ్ చేస్తే బావుంటుంది.




Share/Bookmark

Saturday, March 3, 2012

పనసతొనలు

చాలా ఫేమస్ స్వీట్ ఇది.సింపుల్ గా చేసుకోగల ఈ స్వీట్ పంచదార 

పాకం పీల్చుకుని రెండు మూడు రోజులవరకూ జ్యూసీగా చాలా రుచిగా 

ఉంటాయి.






కావలసిన పదార్ధాలు:


మైదాపిండి                       ఒకకప్పు 

పంచదార                        ఒకకప్పు 

వెన్నలేదా నెయ్యి            రెండు టేబుల్ స్పూన్లు 

ఇలాచీపొడి                      అర టీ స్పూన్ 

నూనె 


తయారు చేసే విధానం:


మైదాపిండిలో వెన్నకానీ,నెయ్యి కానీ వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లుతూ పూరీపిండిలా మృదువుగా కలిపి ఒక 

అరగంట నాననివ్వాలి.

పంచదారలో కొంచెం నీళ్ళు పోసి తీగపాకం పట్టుకోవాలి.ఇందులో ఇలాచీ

పొడి వేయాలి.

నానిన పిండిని చిన్నచిన్న ఉండలు చేసి పూరీలు చెయ్యాలి.వీటిని 

చివరలు విడకుండా మధ్యలో కట్ చేసి రెండువైపుల నుండీ మడుస్తూ 

వచ్చి చివరలు ప్రెస్ చేయాలి.

ఇలా చేసుకున్న పనసతొనలను కాగిన నూనెలో వేయించి పంచదార 

పాకంలో వేయాలి.

రెండుమూడు నిమిషాల తరువాత తీసి ఒక ప్లేట్ లో ఉంచాలి.

చల్లారిన తరువాత స్టోర్ చేసుకోవాలి  
 


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP