Sunday, February 27, 2011

పచ్చి టమాటా పచ్చడి

టమాటా పచ్చడి అనగానే ఎర్రగా నోరూరిస్తూ పండు టమాటాలతో చేసే 

పచ్చడి గుర్తొస్తుంది.అలాగే గట్టిగా ఆకుపచ్చగా ఉండే పచ్చి టమాటాలతో

చేస్తే కూడా చాలా బావుంటుంది.అన్నం లోకే కాకుండా ఇడ్లీ,దోశ లాంటి 

టిఫిన్స్ లోకి కూడా బాగుంటుంది.







కావలసిన పదార్ధాలు 

పచ్చి టమాటాలు                   పావుకిలో 

పచ్చిమిర్చి                         ఎనిమిది 

వెల్లుల్లి రెబ్బలు                     నాలుగు 

జీలకర్ర                               అర స్పూను 

ఉప్పు                                తగినంత

కరివేపాకు                         ఒక రెమ్మ 

కొత్తిమీర                            ఒక కట్ట 

నూనె                                నాలుగు స్పూన్లు 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి 

తయారు చేసే విధానం :

టమాటాలను ముక్కలు కోసి ,మిర్చి,కొత్తిమీర కలిపి రెండు స్పూన్ల 

నూనె వేసి నీరంతా పోయేవరకూ వేయించాలి.

టమాటాలు పులుపు కాబట్టి మిర్చి కొంచెం ఎక్కువే పడతాయి.కారం 

తక్కువ తినేవారు తగ్గించుకోవచ్చు.

చల్లారాక  ముందు మిర్చి,ఉప్పు,జీలకర్ర,వెల్లుల్లి గ్రైండ్ చెయ్యాలి.

ఇప్పుడు వేగిన టమాటా ముక్కలు కూడా వేసి గ్రైండ్ చెయ్యాలి

నూనె వేడి చేసి తాలింపు వేసి పచ్చడిలో కలిపితే పుల్లగా ,రుచిగా ఉండే 

పచ్చిటమాటా పచ్చడి సిద్దం.





Share/Bookmark

Thursday, February 24, 2011

కిచిడీ

చాలా సింపుల్ గా అయిపోయే రైస్ ఐటం ఇది.పప్పులు.బియ్యం జత 

కలవడంతో ఫుల్ మీల్ అయిపోతుంది. పిల్లలకీ,పెద్దవాళ్ళకీ  చాలా

హెల్దీ ఫుడ్ కూడా 

 






కావలసిన పదార్ధాలు:

బియ్యం                             రెండు కప్పులు 

పెసరపప్పు                            ఒక కప్పు

మసూర్ దాల్                       అర కప్పు
(ఎర్ర కందిపప్పు )                   

ఉల్లిపాయ                            ఒకటి 

మిర్చి                                రెండు 

కరివేపాకు                            ఒక రెమ్మ 

కొత్తిమీర                             ఒక కట్ట 

కారట్ తురుము                    ఒక కప్పు 

టమాటా                             ఒకటి 

అల్లంవెల్లుల్లి  ముద్ద                 ఒక  టీ స్పూను 

గరం మసాలా పొడి                 ఒక టీ స్పూను 

నూనె                                రెండు టేబుల్ స్పూన్లు 

నెయ్యి                               రెండు టీ స్పూన్లు

ఉప్పు                                తగినంత 

పసుపు                             కొంచెం

తాలింపుకు 

శనగపప్పు,ఆవాలు,జీలకర్ర ,మిరియాలు,ఎండుమిర్చి
                

తయారుచేసే విధానం :

బియ్యం,పప్పులు కడిగి ఒక పావుగంట నానబెట్టాలి.

నూనె,నెయ్యి కలిపి వేడి చేసి తాలింపు వేసి దోరగా వేయించాలి.జీలకర్ర,

మిరియాలు కొంచెం ఎక్కువ వేస్తే రుచి బావుంటుంది. 

సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,కరివేపాకు వేసి వేయించి కారట్ తురుము,

టమాటా ముక్కలు కూడా వేసి వేయించాలి.

ఇప్పుడు కొత్తిమీర,అల్లంవెల్లుల్లి ముద్ద,పసుపు,గరంమసాలాపొడి అన్నీ 

వేసి కొంచెం వేయించాలి.

చివరగా నానబెట్టిన బియ్యం,పప్పులు కూడా వేసి రెండు నిమిషాలు 

వేయించి సరిపడా నీళ్ళు,తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి కుక్కర్ 

మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.

వేడివేడిగా వడ్డిస్తే ఘుమఘుమలాడుతూ కిచిడీ నోరూరిస్తుంది.

ఇష్టం ఉన్నవారు ఇంకా కూరగాయలు కూడ వేసుకోవచ్చు.
     


Share/Bookmark

Saturday, February 19, 2011

పాలకూర, పండుమిర్చి పచ్చడి

పండుమిరపకాయ పచ్చడి అందరి ఇళ్ళల్లో ఉంటుంది.  గోంగూర 

పండుమిరప పచ్చడి కూడా ఎక్కువగా చేస్తాము.అలాగే పాలకూర,

పండుమిర్చి కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. 

పండుమిర్చిపచ్చడి పెట్టినప్పుడు తాలింపు వెయ్యకుండా కాస్త పచ్చడి

ఫ్రిజ్ లోఉంచుకుంటే అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకోవచ్చు.

 





కావలసిన పదార్ధాలు :

పాలకూర                                       మూడు కట్టలు

పండుమిరప పచ్చడి                  ఒక కప్పు 

నూనె                                  పావు కప్పు 

కరివేపాకు                              రెండు రెమ్మలు 

వెల్లుల్లి రెబ్బలు                      రెండు మూడు

ఉప్పు                                    చిటికెడు 

తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు ,ఎండుమిర్చి


తయారు చేసే విధానం:

ముందుగా రెండు స్పూన్లు నూనె వేడి చేసి సన్నగా తరిగిన పాలకూర,

చిటికెడు ఉప్పు వేసి తడి లేకుండా వేయించాలి.

బాగా మగ్గిన తరువాత కొంచెం చల్లార్చి పండుమిరప పచ్చడితోకలిపి 

మిక్సీ లో గ్రైండ్ చెయ్యాలి 

ఇప్పుడు నూనె వేడిచేసి వెల్లుల్లిరెబ్బలు,శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,

ఎండుమిర్చివేసి దోరగా వేయించాలి.కరివేపాకు కూడా వేసి, పోపును 

పచ్చడిలో కలిపితే ఘుమఘుమలాడే పచ్చడి సిద్దం 

వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది.

ఫ్రిజ్ లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది 


Share/Bookmark

Thursday, February 17, 2011

పావ్ భాజీ

చాలా ఫేమస్ ఐటం ఈ పావ్ భాజీ. ఈ మసాలాపొడి రెడీగా ఉంటే 

పావుగంటలో ఇంట్లోనే చేసెయ్యొచ్చు.అన్ని కూరగాయలతో ఎంతో 

రుచిగా ఉండే ఈ డిష్ ని పిల్లలూ చాలా ఇష్టపడతారు.








కావలసిన పదార్ధాలు:

పావ్                                  ఒక పాకెట్ 

ఉల్లిపాయ                           ఒకటి పెద్దది 

మిర్చి                                రెండు

కరివేపాకు                          ఒక రెమ్మ 

టమాటాలు                         మూడు 

ఉప్పు,కారం                          తగినంత 

పసుపు                               కొంచెం

పావ్ భాజీ మసాలా                రెండు స్పూన్లు

అల్లంవెల్లుల్లి ముద్ద                 రెండు టీ స్పూన్స్

కొత్తిమీర                              ఒక కట్ట  

నిమ్మకాయ                         ఒకటి   

నూనె                               మూడు టేబుల్ స్పూన్లు 

నెయ్యి                              రెండు స్పూన్లు

ఆలూ                                మూడు

కారట్,కాప్సికం,కాలిఫ్లవర్,పచ్చిబటానీ ,కాబేజ్ ,బీన్స్  ఒక కప్పు 

చొప్పున


తయారు చేసే విధానం:


పాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కరివేపాకు 

వేసి వేయించాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి బాగా మగ్గిన 

తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద,పసుపు,కారం,పావ్ భాజీ మసాలా వేసి 

నూనె తేలేవరకూ వేయించాలి.

ఇప్పుడు తరిగిన కూరగాయలు అన్నీ వేసి రెండునిమిషాలు వేయించి 

తగినంత ఉప్పు,నీళ్ళు పోసి,మూతపెట్టి అయిదారు విజిల్స్ రానివ్వాలి.

స్టీం పోయాక ఉడికిన కూరగాయలని మెత్తగా మెదిపి రెండునిమిషాలు 

కూర చిక్కబడేవరకూ ఉడికించి కొత్తిమీర చల్లి  దింపెయ్యాలి.

పావ్ ని మధ్యకి కట్ చేసి నెయ్యి వేడి చేసి పేనంపై కొంచెం వేయించాలి.

వేడివేడిగా పావ్ లను కూరతో సర్వ్ చేస్తే ఘుమఘుమలాడే పావ్ భాజీ 

ఊరిస్తుంది.

సర్వ్ చేసేటప్పుడు కూరలో నిమ్మరసం పిండి కొత్తిమీర  చల్లాలి.

నోట్:ఇలా కాకుండా ముందే ఆలూ,కూరగాయ ముక్కలు ఉడికించి 

కూడా కూర చేసుకోవచ్చు.




Share/Bookmark

Tuesday, February 15, 2011

వెజిటబుల్ సేమ్యా ఉప్మా

చాలా  త్వరగా  అయిపోయే  టేస్టీ టిఫిన్ ఈ సేమ్యా ఉప్మా.ఇందులోనే 

వెజిటబుల్స్ కూడా వేసి చేస్తే పిల్లలూ ఇష్టంగా తింటారు.బాక్స్ లో పెట్టి 

ఇచ్చినా బావుంటుంది.





కావలసిన పదార్ధాలు:

సేమ్యా                           ఒక గ్లాస్ 

ఆలూ                            ఒకటి 

కారట్                            ఒకటి 

టమాటా                        ఒకటి 

ఉల్లిపాయ                      ఒకటి 

మిర్చి                          మూడు

కరివేపాకు                      ఒక రెమ్మ 

కొత్తిమీర                       కొంచెం 

పసుపు                       చిటికెడు 

ఉప్పు                           తగినంత 

అల్లంవెల్లుల్లి ముద్ద           అర టీ స్పూను 

గరంమసాలా పొడి            అర స్పూను 

నూనె                            మూడు టేబుల్ స్పూన్లు 

జీడిపప్పు                       కొంచెం 

నీళ్ళు                              ఒక గ్లాస్ 

తాలింపుకు                      శనగపప్పు,మినప్పప్పు ,ఆవాలు

తయారు చేసే విధానం:

ముందుగా ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి సేమ్యా వేయించి 

తీసుకోవాలి.

ఒక గిన్నెలో మిగిలిన నూనె వేడి చేసి తాలింపు వేసి,జీడిపప్పు కూడా 

వేసి దోరగా వేయించాలి.

ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి,ఆలూ,కారట్,కరివేపాకు వేసి 

కొంచెం వేగాక టమాటా ముక్కలు వెయ్యాలి.

తరువాత పసుపు,అల్లంవెల్లుల్లి ముద్ద,గరంమసాలా పొడి,కొత్తిమీర వేసి 

బాగా కలిపి  కొంచెం ఉడికించి ,నీరు పొయ్యాలి.

తగినంత  ఉప్పు వేసి నీళ్ళు మరిగిన తరువాత వేయించిన సేమ్యా 

వెయ్యాలి.

ఒకసారి కలిపి ఈ గిన్నెను ప్రెషర్ పాన్ లో ఉంచి మూడు విజిల్స్ 

రానిస్తే సేమ్యా ఉప్మా రెడీ అవుతుంది.

కుక్కర్ లో కాకుండా సేమ్యా ఉడికేవరకూ ఉంచి విడిగా కూడా 

చేసుకోవచ్చు.

నోట్: గ్లాస్ అయినా కప్ అయినా సేమ్యా దేనితో తీసుకున్నామో 

నీళ్ళుకూడా కరెక్ట్ గా దానితోనే పొయ్యాలి.


Share/Bookmark

Saturday, February 12, 2011

గోల్డెన్ బర్ఫీ

దీనినే సెవెన్ కప్ స్వీట్ అని కూడా అంటారు.చాలా ఈజీగా 

పావుగంటలో అయిపోయే స్వీట్ ఇది.






కావలసిన పదార్ధాలు :

శనగపిండి                             ఒక కప్ 

పచ్చికొబ్బరి తురుము               ఒక కప్ 

పాలు                                   ఒక కప్ 

నెయ్యి                                  ఒక కప్ 

పంచదార                              మూడు కప్పులు 

కాజూ                                    పది 

ఇలాచీ పొడి                          ఒక టీ స్పూను 


తయారు చేసే విధానం:

అన్నీ ఒక పాన్ లో వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి 

దగ్గరవుతుండగా వేయించిన కాజూ,ఇలాచీపొడి వేసి కలిపి నెయ్యి 

రాసిన ప్లేట్లో పోసి కొంచెం చల్లారాక ముక్కలు కట్ చేసుకోవాలి. 


ఈ స్వీట్ ని  మైక్రోవేవ్ లో చెయ్యాలంటే అన్నీ ఒక పెద్ద గాజుబౌల్ లో 

వేసి బాగా కలిపి హైలో పెట్టి ఉడికించాలి.మూడు నిమిషాలకు ఒకసారి 

తీసి కలుపుతూ,దగ్గరయ్యాక నెయ్యి రాసిన ప్లేట్ లో పోయాలి.


Share/Bookmark

Monday, February 7, 2011

చిల్లీ కొరియాండర్ చికెన్ కర్రీ

నాన్ వెజ్ లో చికెన్ ఇష్టపడని వారు ఎవరూ ఉండరు కదా ఎప్పుడూ

ఒకే రకంగా వండినా బోర్ అనిపిస్తుంది.అవే పదార్ధాలు అయినా కొంచెం

మార్చి  వండితే కొత్త రుచితో బావుంటుంది ఏ వంటకం అయినా.అలా

చేసినదే ఈ చికెన్ కూర.చాలా రుచిగా ఉంది.మీరూ  చేసి చూడండి.







కావలసిన పదార్ధాలు :



చికెన్                                అర కిలో 

ఉల్లిపాయ                          రెండు 

మిర్చి                               ఆరు 

కొత్తిమీర                           అర కప్పు 

అల్లంవెల్లుల్లి ముద్ద               రెండు టీస్పూన్లు 

కరివేపాకు                         ఒక రెమ్మ

ఉప్పు,కారం                        తగినంత 

పసుపు                           కొంచెం

నూనె                               అర కప్పు 

మసాలాకు

లవంగాలు                     ఆరు

చెక్క                           రెండు ముక్కలు 

ధనియాలు                  ఒక టేబుల్ ద్పూను 

జీలకర్ర                         ఒక టేబుల్ స్పూను 

గసగసాలు                     ఒక టేబుల్ స్పూను 

ఎండుకొబ్బరి                  చిన్న ముక్క 



తయారు చేసే విధానం :



ముందుగా మసాలాకు రాసినవి అన్నీ మెత్తగా పొడి కొట్టుకోవాలి.

కొత్తిమీర ,మిర్చి కలిపి గ్రైండ్ చేసుకోవాలి.

నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు వేసి

వేయించాలి.

వేగిన తరువాత ,పసుపు, కారం ,అల్లంవెల్లుల్లి ముద్ద,మిర్చి కొత్తిమీర 
ముద్ద  ఒక దాని తరువాత ఒకటి వేసి వేయించాలి.

నూనె పైకి తేలాక చికెన్ ముక్కలు వేసి కలిపి,కొంచెం ఉడికించాలి.

ఇప్పుడు మసాలాపొడి,తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం నీళ్ళు

పోసి,మూత పెట్టి సన్నని సెగపై ఉడికించుకోవాలి.

చికెన్ మెత్తగా ఉడికి కూర బాగా చిక్కబడిన తరువాత, బౌల్ లోకి

తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి.
  


                                   


Share/Bookmark

Friday, February 4, 2011

వంకాయ, దోసకాయ పచ్చడి


ఎన్ని కూరలున్నా,రోటి పచ్చళ్ళు చాలా మంది ఇష్టంగా తింటారు.మన 

తెలుగునాట చాలా రకాల వెరైటీ పచ్చళ్ళు చేస్తారు.వాటిలో ఈ పచ్చడి 

చాలా ముఖ్యమైనది.ముద్దపప్పు,ఈ పచ్చడి  కాంబినేషన్  పెళ్ళిళ్ళు,

ఫంక్షన్స్ లోకూడా తప్పనిసరిగా  ఉంటుంది.వేడి అన్నంలో నెయ్యి 

వేసుకుని తింటే చాలా బావుంటుంది.





 


కావలసిన పదార్ధాలు :


వంకాయలు                 పావు కిలో 

దోసకాయ                   ఒకటి 

పచ్చిమిర్చి                  పది 

టమాటా                     ఒకటి 

కొత్తమీర                     సగం కట్ట 

చింతపండు                  కొంచెం 

ఉప్పు                         తగినంత 

జీలకర్ర                       అర టీ స్పూను 

వెల్లుల్లి రెబ్బలు              ఆరు 

పసుపు                      చిటికెడు 

నూనె                        నాలుగుస్పూన్లు 

కరివేపాకు                   రెండు రెమ్మలు 


తాలింపుకు                  శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి


తయారు చేసే విధానం:


వంకాయముక్కలు,టమాటా,మిర్చి,కొత్తిమీర  ఒక పాన్ లో వేసి రెండు 

స్పూన్లు నూనె వేసి వేయించాలి.

సన్నని సెగపై బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి. 

ముందు మిర్చి,ఉప్పు,జీలకర్ర,వెల్లుల్లి,చింతపండు మిక్సీలో గ్రైండ్ 

చెయ్యాలి.తరువాత వేయించిన వంకాయ,టమాటా ముక్కలు వేసి 

మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.

ఈ పచ్చడిలో సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు కలపాలి.

మిగిలిన  నూనె వేడి చేసి పప్పులు,ఆవాలు,ఎండుమిర్చి,కరివేపాకు,

చిటికెడు పసుపు వేసి,ఈ తాలింపును పచ్చడిలో  కలపాలి.

దోసకాయ ముక్కలు పచ్చడిలో ఊరి కరకరలాడుతూ బావుంటుంది.


 


Share/Bookmark

Thursday, February 3, 2011

గరంమసాలా పొడి

వంట చేసేటప్పుడు హడావుడి లేకుండా ఈజీ గా అయిపోవాలంటే ఈ 

గరంమసాలా పొడి,అల్లంవెల్లుల్లి పేస్ట్ ,చింతపండుపేస్ట్,ఇలాంటివి రెడీగా

ఉంచుకుంటే చాలా సుఖంగా ఉంటుంది.బహుశా ఇవి అందరికీ 

తెలిసినవే అయినా నేను ఫాలో అయ్యేవి చెప్తాను.



గరంమసాలా పొడి



కావలసిన  పదార్ధాలు :




లవంగాలు                  25

దాల్చిన చెక్క              5 గ్రాములు   

జీలకర్ర                      అర కప్పు 

ధనియాలు                 ఒకటిన్నర కప్పులు 

కప్ అంటే కాఫీ కప్ కొలత తీసుకోవచ్చు 


అన్నీ కలిపి ఒక పాన్ లో వేసి,స్టవ్ పై సిమ్ లో రెండు మూడు 

నిమిషాలు వేయించాలి.

కొంచెం సువాసన రాగానే ఆఫ్ చేసి చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఒక బాటిల్ లో పోసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజులైనా  ఫ్రెష్ గా 

ఉంటుంది.తడి మాత్రం తగలకూడదు. 


మరీ స్పైసీగా ఉంది అనిపిస్తే ఎవరి టేస్ట్ కి  తగ్గట్టు వారు మార్పులు

చేసుకోవచ్చు.ఖచ్చితంగా ఇంతే కొలత అని అక్కర్లేదు షుమారుగా 

వేసుకోవచ్చు.ఇది ఉంటే విడిగా ధనియాల పొడి,జీలకర్ర పొడి 

వెయ్యక్కర్లేదు.ఇది ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది 


చింతపండు పేస్ట్ :


ఒక పావు కిలో చింతపండు లో ఒక గ్లాస్ నీళ్ళు  పోసి స్టవ్ పై పొంగు

వచ్చేవరకూ  ఉంచి దింపెయ్యాలి.చల్లారాక  చిల్లుల పళ్ళెం (జల్లెడ) లో 

వేసి మొత్తం పులుసు చిక్కగా తీయాలి.అవసరం అయితే కొంచెం

నీళ్ళు వాడవచ్చు.


ఈ గుజ్జును మళ్లీ స్టవ్ పై ఉంచి చిక్కబడేదాకా ఉడికించాలి.చల్లారాక

ఒక బాటిల్ లోకి తీసుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి.తడి తగలకపోతే

నెలరోజులైనా  నిలువ ఉంటుంది.


పప్పు,సాంబారు,రసం, పులుసు ఇలా ఏది చేసినా రెండు స్పూన్లు

వేసేస్తే సరిపోతుంది.అప్పటికప్పుడు నానబెట్టడం,హడావుడి ఉండదు.


అల్లంవెల్లుల్లి పేస్ట్ :


ఒక కప్ అల్లం ముక్కలు,ఒక కప్ వెల్లుల్లి రెబ్బలు,చిటికెడు పసుపు,

అరస్పూను నూనె వేసి గ్రైండ్ చేసుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి.

కూరల్లోకి అయినా,ఏ రైస్ ఐటం చెయ్యాలన్నా ఈజీగా ఉంటుంది..

ఈ కొలతలతో చేస్తే  ఒక వారం రోజులు వస్తుంది.


నాన్ వెజ్  కర్రీస్ కి మాత్రం,అల్లంవెల్లుల్లి అయినా,గరంమసాలా పొడి  

అయినా అప్పటికప్పుడు ఫ్రెష్ గా గ్రైండ్  చేసుకుంటే టేస్ట్ బావుంటుంది.


వెల్లుల్లి రెబ్బలు:

ఖాళీ గా ఉన్నప్పుడు ఒక వెల్లుల్లి పాయ రెబ్బలు వలిచి చిన్నబాటిల్లో 

వేసి ఫ్రిజ్ లో ఉంచుకుంటే తాలింపు వేసేటప్పుడు ఒకటి రెండు చిదిమి

వేసెయ్యొచ్చు.


కారం ;

ఇదివరకు మిరపకాయలు కొని ఎండబెట్టి కారం కొట్టించే వాళ్ళు కానీ

ఇప్పుడు అంతా రెడీమేడ్ కదా .బయటకొనేది పచ్చికారం.దీనికి కొంచెం

దినుసులు పొడి కొట్టి కలుపుకుంటే కూరల్లోకి రుచికరమైన కారం

తయారవుతుంది.


కారం                       అరకిలో 

ధనియాలు               ఒక కప్ (కాఫీ కప్ కొలత ) 

జీలకర్ర                     అర కప్పు 

మెంతులు                రెండు టీ స్పూన్లు 

ఉప్పు                       రెండు టీ స్పూన్లు 

వెల్లుల్లి పాయ             ఒకటి 


ధనియాలు,జీలకర్ర ,మెంతులు  సన్నని సెగపై వేయించాలి.మెంతులు 

వేగిన సువాసన రాగానే దించేసి అందులోనే ఉప్పు వేయాలి.

కొంచెం చల్లారాక మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.ఇందులో వలిచిన  వెల్లుల్లి 

రెబ్బలు చేసి మళ్లీ గ్రైండ్ చెయ్యాలి 

చివరిగా కారం వేసి ఒకసారి గ్రైండ్ చెయ్యాలి 

బాగా కలిపి బాటిల్ లోకి తీసి స్టోర్ చేసుకోవాలి ,కొంచెం చిన్నదానిలోకి 

తీసుకుని వాడుకోవచ్చు.ఇలా ఒక అరకిలో చేసుకుంటే దాదాపు 

మూడు నెలలు వస్తుంది.

ఏ కూరలో వేసినా కమ్మని రుచి వస్తుంది.

















Share/Bookmark

Tuesday, February 1, 2011

మసాలా బేబీపొటాటోస్

ఈ సీజన్ లో చిన్నచిన్న బేబీపొటాటో లు బాగా దొరుకుతాయి వీటితో 

ఎక్కువగా గ్రేవీ కూరలు,దం ఆలూ చేస్తాము కదా,ఇలా మసాలా ఫ్రై చేస్తే 

కూడా చాలా బావుంటుంది.రైస్, చపాతిలోకి ,సాంబారు,రసం వీటిలోకి 

జతగా ఇవి బావుంటాయి.








కావలసిన పదార్ధాలు :


బేబీ ఆలూ                       పావుకిలో 

ఉల్లిపాయ                        ఒకటి 

మిర్చి                            అయిదు 

అల్లంవెల్లుల్లి ముద్ద             ఒక టీ స్పూను 

గరంమసాల పొడి               ఒక టీ స్పూను 

ఉప్పు,కారం                       తగినంత 

పసుపు                            పావు స్పూను 

కరివేపాకు                         ఒక రెమ్మ 

కొత్తిమీర                            ఒక కట్ట 

నూనె                               మూడు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,జీలకర్ర ,ఎండుమిర్చి.


తయారు చేసే విధానం:


ముందుగా ఆలూ ఉడికించి పొట్టు తీసి ఉంచాలి.

పచ్చిమిర్చి,కొత్తిమీర కలిపి గ్రైండ్ చేసుకోవాలి.

నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,

కరివేపాకు వేసి వేయించాలి.

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద,పసుపు,మిర్చి కొత్తిమీర పేస్ట్ వేసి 

వేయించాలి 

తరువాత ఆలూ వేసి,ఉప్పు,కారం వేసి సన్నని సెగపై బాగా వేగనివ్వాలి.

చివరిగా గరంమసాలా పొడి వేసి  కొంచెం వేయించి దింపెయ్యాలి

ఒక బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చెయ్యాలి


Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP