Wednesday, January 26, 2011

బ్రెడ్ కారట్ బాసుంది

బ్రెడ్ తో ఏ స్వీట్ చేసినా చాలా రుచిగా ఉంటుంది.పిల్లలూ ఇష్టంగా 

తింటారు ఎక్కువ నెయ్యి అవసరం లేకుండా సింపుల్ గా రెడీ అయ్యే 

ఈ స్వీట్ కి కొంచెం కారట్ జత చేస్తే కలర్ ఫుల్ గా ఈ బాసుంది 

తయారవుతుంది.





కావలసిన పదార్ధాలు:

బ్రెడ్                           నాలుగు స్లైసులు 

కారట్ తురుము             ఒక కప్పు 

పంచదార                     ఒకటిన్నర కప్పు 

పాలు                          అరలీటరు 

నెయ్యి                         రెండు టేబుల్ స్పూన్లు 

ఇలాచీ పొడి                   ఒక స్పూను 

కాజూ                           పది 

యిన్ స్టంట్ బాదం మిక్స్ పౌడర్  ఒక స్పూను 


తయారు చేసే విధానం :


బ్రెడ్ స్లైసెస్ ని మిక్సీ లో వేసి క్రంబ్స్ గా చేసుకోవాలి .

ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి ఈ క్రంబ్స్ ని కొంచెం వేయించి 

తీసుకోవాలి 

ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసి కారట్ తురుమును కొంచెం 

వేయించాలి.

పాలని కొంచెం మరిగించి అందులో ఈ వేయించిన బ్రెడ్ క్రంబ్స్,కారట్ 

తురుము వేసి కొంచెం ఉడకనివ్వాలి.

ఇప్పుడు పంచదార కలిపి కొంచెం చిక్కబడేదాకా ఉడికించి ఇలాచీ పొడి

వేసి కలపాలి.

యిన్ స్టంట్ బాదంమిక్స్ పౌడర్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

ఇది వేస్తే కొంచెం ఫ్లేవర్,కలర్ బావుంటుంది.లేకపోయినా పర్లేదు. 

ఒక బౌల్ లోకి తీసుకుని వేయించిన కాజూతో  అలంకరించాలి.

ఫ్రిజ్ లో ఉంచి చల్లగా సర్వ్ చేస్తే ఈ బాసుందీ చాలా రుచిగా ఉంటుంది.



Share/Bookmark

Sunday, January 23, 2011

సేమ్యా పులిహోర


పులిహోరను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.

నిమ్మకాయ,మామిడికాయ ఇలా ఎన్నిరకాలు ఉపయోగించి చేసినా 

చింతపండు పులిహోర రుచేవేరు,అలాగే ఎప్పుడూ రైస్ తోనే కాకుండా 

ఇలా సేమ్యాతో చేస్తే కూడా చాలా రుచిగా ఉంటుంది.పిల్లలకి బాక్స్ లో

పెట్టి ఇవ్వడానికి కూడా బావుంటుంది.చింతపండు పేస్టు రెడీగా ఉంటే

అయిదే అయిదు నిమిషాల్లో ఈజీగా చేసెయ్యొచ్చు










కావలసిన పదార్ధాలు :

సేమ్యా                           రెండు కప్పులు 

చింతపండు పేస్టు              రెండు టేబుల్ స్పూన్లు 

ఉప్పు                              తగినంత 

మిర్చి                             నాలుగు 

అల్లం                              చిన్న ముక్క 

కరివేపాకు                        రెండు రెమ్మలు 

నూనె                             మూడు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,వేరుసెనగ గుళ్ళు 


తయారు చేసే విధానం:

ముందుగా నీళ్ళు మరిగించి సేమ్యా ,కొంచెం ఉప్పు,అర స్పూను నూనె 

వేసి ఉడికించాలి.

సేమ్యా ఉడకగానే జాలీలోవార్చి వెంటనే చల్లనినీళ్ళు పోయాలి.అప్పుడు 

సేమ్యా పొడిపొడి గా ఉంటుంది 

నూనె వేడి చేసి వేరుశనగ గుళ్ళు,శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు 

ఎండుమిర్చి వేసి తాలింపు వెయ్యాలి.

వేగాక కరివేపాకు,సన్నగా తరిగిన అల్లం ముక్కలు,వాలికలుగా కోసిన 

మిర్చి వేసి దోరగా వేగాక కొంచెం  పసుపు వెయ్యాలి.

స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన సేమ్యా ,చింతపండు పేస్ట్ ,తగినంత ఉప్పు 

వేసి బాగా కలపాలి.

ఒక పావుగంట ఆగితే, ఊరి రుచిగా ఉంటుంది.


Share/Bookmark

Thursday, January 20, 2011

కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ

ఈ సీజన్ లో బాగా దొరికే కాలీఫ్లవర్ అంటే ఇష్టపడని వారు ఉండరు.

సాధారణంగా ఆలూ తో కానీ టమాటా,పచ్చిబటానీ కానీ కలిపి కూర 

చేస్తాము కదా.ఇలా ఎగ్స్ కాంబినేషన్ లో కూర చేస్తే చాలా రుచిగా 

బావుంటుంది.కాలీఫ్లవర్ ని తురుము లాగ సన్నగా తరిగి ఈ కూర 

వండితే కీమా  ఫ్రై లాగ ఉంటుంది.













కావలసిన పదార్ధాలు:




కాలిఫ్లవర్                               ఒకటి చిన్నది 

ఎగ్స్                                      రెండు 

ఉల్లిపాయ                               ఒకటి

మిర్చి                                    రెండు 

టమాటా                                 ఒకటి 

అల్లంవెల్లుల్లి ముద్ద                    ఒక టీ స్పూను 

గరం మసాలాపొడి                    ఒక టీ స్పూను 

కరివేపాకు                               ఒక రెమ్మ 

కొత్తిమీర                                 అర కప్పు 

ఉప్పు,కారం                             తగినంత 

పసుపు                                 కొంచెం 

నూనె                                    రెండు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు 

శనగపప్పు,మినప్పప్పు,జీలకర్ర,ఆవాలు,ఎండుమిర్చి 

తయారు చేసే విధానం:

నూనె వేడిచేసి తాలింపు వేసుకోవాలి.వేగాక సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి 

ముక్కలు,కరివేపాకు వేసి దోరగా వేగనివ్వాలి.

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.తరువాత సన్నగా తరిగిన 

కాలిఫ్లవర్ వేసి తగినంత ఉప్పు,పసుపు వేసి కలిపి మూత పెట్టి 

మగ్గనివ్వాలి.

నీరు ఇగిరిపోయిన తరువాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి,

మూత పెట్టి ఉడికించాలి.

టమాటా ఉడికిన తరువాత  కారం వేసి నూనె తేలేవరకూ వేయించాలి.

ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి ఇందులో వేసి ఒకసారి కలిపి సన్నని సెగపై 

వేగనివ్వాలి

బాగా ఉడికిన తరువాత కలిపితే కొంచెం పొడిపొడిగా అవుతుంది.

ఇప్పుడు గరంమసాలాపొడి,సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి రెండు 

నిమిషాలు  వేయించి దించెయ్యాలి.

బౌల్ లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చేస్తే కాలిఫ్లవర్ ఎగ్ కర్రీ సిద్దం.

ఈ కూర రైస్ లోకి,చపాతి రోటీ లకు,ఇంకా బ్రెడ్  సాండ్విచ్ లోకి కూడా 

బావుంటుంది.



Share/Bookmark

Sunday, January 16, 2011

సేమ్యా, రవ్వ ఇడ్లీ మైక్రోవేవ్ లో

తెల్లగా మల్లెపువ్వుల్లా,నోట్లో వేసుకుంటే దూదుల్లా కరిగిపోయే ఇడ్లీ,

చట్నీ,కారప్పొడి, నెయ్యి కాంబినేషన్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి 

వేడిగా పొగలు కక్కుతూ,ఊరించే ఆరోగ్యకరమైన టిఫిన్ ఇడ్లీ.కాకపోతే 

ముందురోజు పప్పు,రవ్వ నానబెట్టుకోడం,రుబ్బుకోడం ఇలాంటివి 

తప్పవు అనుకోండి.అంత కష్టపడకుండా యిన్ స్టంట్ గా చేసుకునే ఈ 

ఇడ్లీ కూడా చాలా బావుంటుంది.ట్రై చేసి చూడండి.

ఇవి మైక్రోవేవ్ లో చేసిన ఇడ్లీలు  












కావలసిన  పదార్ధాలు : 

బొంబాయి రవ్వ                       రెండు కప్పులు 

సేమ్యా                                 రెండు కప్పులు 

పెరుగు                                మూడు కప్పులు 

ఉల్లిపాయ                             ఒకటి 

మిర్చి                                  ఒకటి 

కారట్ తురుము                      ఒక కప్పు 

కొత్తిమీర                              కొంచెం 

ఉప్పు                                  తగినంత 

వంటసోడా                           పావు స్పూను

తాలింపుకు                            

శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు 

నూనె                                  ఒక టేబుల్ స్పూను 

తయారు చేసే విధానం:


ముందుగా బొంబాయి రవ్వను దోరగా వేయించుకుని ఒక బౌల్ లోకి 

తీసుకోవాలి.

ఒక స్పూన్ నూనెలో సేమ్యాను గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుని 

రవ్వ లో వేయాలి.

ఇప్పుడు ఇందులో పెరుగు,తగినంత ఉప్పు, వంటసోడా వేసి బాగా కలిపి 

అరగంట సేపు నాననివ్వాలి.

ఒక స్పూన్ నూనె వేడి చేసి తాలింపు వేసి అందులో సన్నగా తరిగిన 

ఉల్లి,మిర్చి,కొత్తిమీర,కారట్ తురుము వేసి ఒక  నిమిషం వేయించి 

నానిన రవ్వ మిశ్రమం లో కలపాలి.ఇవి ఇష్టం లేనివారు కలపకుండా 

ప్లెయిన్ గా కూడా వేసుకోవచ్చు.

మిశ్రమం గట్టిగా ఐతే కొంచెం నీరు కలిపి ఇడ్లీ పిండిలా చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసి పది నిమిషాలు ఉడికించాలి.

వేడి వేడిగా కొబ్బరి పచ్చడితో వడ్డిస్తే యిన్ స్టంట్  ఇడ్లీ సిద్దం.

మైక్రోవేవ్ లో వేయాలంటే 640 వాట్స్ లో 5 నిమిషాలు పెడితే ఇడ్లీలు 

రెడీ అవుతాయి.ఐతే తప్పనిసరిగా మూత  పెట్టి మాత్రమే ఓవెన్ లో 

ఉడికించాలి.























Share/Bookmark

Thursday, January 13, 2011

చికెన్ బిర్యానీ

నాన్ వెజ్ ప్రియులకి ముందుగా గుర్తొచ్చేది చికెన్ బిర్యానీ మాత్రమే.

దీని తరువాతే ఏదైనా.అందులోనూ హైదరాబాదీ దం బిర్యానీ ఎంత

పాపులరో కూడా తెలుసు.ఇంట్లో చెయ్యాలంటే కొంచెం భయపడతాము.

ముఖ్యంగా ఆ గోధుమ పిండితో సీల్ చెయ్యడం,తావా పై పెట్టి

చెయ్యడం, ఈ కష్టం లేకుండా ఇలా కుక్కర్ లో చెయ్యండి.కొంచెం 

ఈజీగా అయిపోతుంది.














కావలసిన పదార్ధాలు:

నానబెట్టడానికి

చికెన్                        పావుకిలో 

పెరుగు                      ఒక కప్పు 

అల్లంవెల్లుల్లి ముద్ద        ఒక టేబుల్ స్పూను 

గరం మసాలా పొడి        ఒక టేబుల్ స్పూను 

మిర్చి                        రెండు 

పుదీనా                      కొంచెం 

ఉప్పు,కారం                 తగినంత 

పసుపు                      అర టీ స్పూను

నూనె                         ఒక టేబుల్ స్పూను 


బిరియానీకి

బాస్మతి రైస్                  ఒక గ్లాసు 

ఉల్లిపాయ                    ఒకటి 

మిర్చి                          రెండు 

పుదీనా                       అర కప్పు

కొత్తిమీర                      అర కప్పు

ఉప్పు                           తగినంత 

నూనె                         మూడు టీ స్పూన్లు  

అల్లం వెల్లుల్లి ముద్ద         ఒక టీ స్పూను 

గరం మసాలా పొడి          ఒక టీ స్పూను

నెయ్యి                          రెండు టీ స్పూన్లు  

బిరియాని మసాలకి  (షాజీర,అనాస పువ్వు,జాపత్రి,మరాటీ మొగ్గ,

లవంగాలు.దాల్చిన చెక్క, యాలకులు,బిరియానీ ఆకు)


తయారు చేసే విధానం:


ముందుగా పెరుగులో అన్నీ కలిపి మిశ్రమం తయారుచేసి, చికెన్

ముక్కలు అందులో వేసి కనీసం రెండుగంటలు నాననివ్వాలి. మూడు,

నాలుగు గంటలైన సరే.ఎంత ఎక్కువ నానితే అంత బావుంటుంది.

బియ్యం కూడా కడిగి ఇరవై నిమిషాలు నానబెట్టాలి.

ఒక పెద్ద గిన్నెలో రెండు స్పూన్లు నూనె వేసి వేడి చేసి,అన్నీ రెండు 

రెండు చొప్పున బిరియానీ మసాలా,కొంచెం షాజీర  వేసి దోరగా 

వేయించాలి.

ఇప్పుడు వాలికలుగా తరిగిన ఉల్లి,మిర్చి వేసి ఎర్రగా వేయించాలి   

ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా,కొత్తిమీర ,అల్లంవెల్లుల్లి ముద్ద,

గరంమసాల పొడి వేసి సన్నని సెగపై వేయించాలి.ఇందులో అర

లీటరు నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసి మరగనివ్వాలి.

నీళ్ళు మరుగుతుండగా నానబెట్టిన బాస్మతి బియ్యం ఇందులో

వేయాలి.

ఈ లోగా ప్రెషర్ పాన్  తీసుకుని అందులో రెండు స్పూన్లు నూనె వేసి

అడుగున రెండు బిరియానీ ఆకులు పెట్టి దానిపై నానబెట్టిన చికెన్ ను

పాన్ అంత పరచుకునేలా సర్దాలి. కొంచెం పుదీనా కొత్తిమీర ,చికెన్ పైన

వెయ్యాలి 

బియ్యం మూడు వంతులు ఉడకగానే నీరు వడపోసి ఆ బియ్యాన్ని

చికెన్ పై వేసి సమంగా పరవాలి.

ఇప్పుడు మరికొంచెం పుదీనా,కొత్తిమీర,రెండు స్పూన్ల నెయ్యి పైన

వెయ్యాలి.

ఇష్టం ఉన్నవారు ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ గా డీప్ ఫ్రై  చేసి 

వేసుకోవచ్చు.ఉంటే గోరువెచ్చని పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు 

వెయ్యాలి.(ఈ రెండూ ఆప్షనల్ ). లేకపోయినా  పరవాలేదు

ఇప్పుడు పాన్ మూతపెట్టి చిన్న స్టవ్ మీద ఉంచి వెయిట్ పెట్టాలి.ఒక

విజిల్ రాగానే సిమ్ లో పెట్టెయ్యాలి రెండో విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్

చేసెయ్యాలి.

స్టీం అంతా పోయాక మూత తీసి జాగ్రత్తగా కలిపి సర్వ్ చేస్తే

ఘుమఘుమలాడే చికెన్ బిరియాని నోరూరిస్తుంది.


Share/Bookmark

Tuesday, January 11, 2011

గ్రీన్ పీస్ పులావ్

పచ్చి బటాని  విరివిగా దొరికే సీజన్ ఇది.వచ్చినన్నాళ్ళు అన్ని 

కూరల్లో వేసుకున్నా అచ్చంగా బటానీలతో పులావ్ చేసుకుంటే

ఒక రకమైన ఫ్లేవర్ తో చాలా బావుంటుంది.చాలా తక్కువ పదార్ధాలతో

సులభంగా అయిదు నిమిషాల్లో చేసెయ్యొచ్చు.















 కావలసిన పదార్ధాలు:


పచ్చిబటానీలు               ఒక కప్పు 

బియ్యం                       ఒక గ్లాసు (పది నిమిషాలు నానబెట్టాలి)

ఉల్లిపాయ                     ఒకటి 

మిర్చి                          రెండు 

కరివేపాకు                    ఒక రెమ్మ 

పుదీనా,కొత్తిమీర             అర కప్పు 

టమాటాలు                    రెండు (ఆప్షనల్ )

అల్లంవెల్లుల్లి ముద్ద          రెండు టీ స్పూన్లు 

గరం మసాలా పొడి          రెండు టీ స్పూన్లు 

నూనె                           తగినంత

ఉప్పు,కారం                   తగినంత

పసుపు                       చిటికెడు

లవంగాలు,చెక్క,యాలకులు 


తయారు చేసే విధానం:


నూనె వేడి చేసి మూడు లవంగాలు,ఒక చిన్న దాల్చిన చెక్క

ముక్క,రెండు యాలకులు వేయాలి.


సన్నగా వాలికలుగా తరిగిన  ఉల్లి,మిర్చి ,కరివేపాకు వేసి దోరగా

వేయించాలి.


సన్నగా తరిగిన  పుదీనా,కొత్తిమీర,టమాటా ముక్కలు వేసి బాగా

వేయించి,పచ్చి బటానీలు వెయ్యాలి.


తగినంత కారం,చిటికెడు పసుపు.అల్లం వెల్లుల్లి ముద్ద,గరం

మసాలాపొడి  వేసి వేయించాలి.రెండు గ్లాసుల నీళ్ళు పోసి

తగినంత  ఉప్పు వేయాలి.


నీళ్ళు మరిగిన తరువాత  పది నిమిషాలు నానబెట్టిన బియ్యం వేసి

బాగా కలిపి  కుక్కర్ మూత పెట్టాలి.మూడు విజిల్స్ వచ్చాక

దించెయ్యాలి.


వేడి వేడిగా ఈ పులావ్ ,ఉల్లిపాయ పెరుగు పచ్చడి తో వడ్డిస్తే చాలా

రుచిగా ఉంటుంది.


Share/Bookmark

Sunday, January 9, 2011

ఈజీ బ్రెడ్ టోస్ట్



బ్రెడ్ తోఎన్నిరకాల టోస్ట్ లు అయినా నిమిషాల్లో చేసుకోవచ్చు.జనరల్ 

గా చేసే చీజ్ టోస్ట్ లు కాకుండా రవ్వ, కూరగాయల కాంబినేషన్ లో 

ఈ టోస్ట్ వెరైటీ గా ఉంటుంది.ఈ మిశ్రమం రెండు మూడు రోజులు ఫ్రిజ్ 

లో స్టోర్ చేసుకోవచ్చు.
















కావలసిన పదార్ధాలు:



బొంబాయిరవ్వ               ఒక కప్పు 

పెరుగు                        ఒక కప్పు 

ఉల్లిపాయ                     ఒకటి 

మిర్చి                         రెండు మూడు 

కారట్ తురుము             అర కప్పు 

కాప్సికం                      ఒకటి 

టమాటా                     ఒకటి 

కొత్తిమీర                      అర కప్పు 

అల్లం                          చిన్న ముక్క 

ఉప్పు                          తగినంత 

నూనె                         రెండు టేబుల్ స్పూన్లు

టమాటాసాస్ 


తయారు చేసే విధానం:

ముందుగా పెరుగు లో బొంబాయిరవ్వ వేసి  కలిపి ఒక గంట సేపు 

నాననివ్వాలి.

నానిన రవ్వలో సన్నగా తరిగిన ఉల్లి,మిర్చి.కాప్సికం, టమాటా, 

కొత్తిమీర, పుదీనా,అల్లం వేయాలి.

కారట్ తురుము ,ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.మిశ్రమం గట్టిగ 

ఉంది అనుకుంటే కొంచెం నీళ్ళు కలపొచ్చు .

ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని ఒకవైపు ఈ మిశ్రమాన్ని అప్లై చెయ్యాలి.

పేనం వేడి చేసి కొంచెం నూనె వేసి ముందు  మిశ్రమం లేని వైపున 

ఉంచి కొంచెం వేగాక మెల్లగా తిప్పి సన్నని సెగపై  కాలనివ్వాలి.

గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుని టమాటా సాస్ తో సర్వ్ చేస్తే 

బావుంటుంది.















Share/Bookmark

Friday, January 7, 2011

వెరైటీ ఎగ్ ఫ్రై

ఎగ్స్ తో కర్ర్రీ అనగానే సాధారణంగా పొరటు కానీ,బాయిల్డ్ ఎగ్ కూర 

కానీ చేస్తాము కదా.ఎప్పుడూ అదే కాకుండా ఇలా చేస్తే వెరైటీ గా 

ఉంటుంది.రైస్ లోకి అయినా చపాతి లోకి అయినా బావుంటుంది








కావలసిన పదార్ధాలు:  


ఎగ్స్                      మూడు 

ఉల్లిపాయ                ఒకటి 

టమాటాలు              రెండు పెద్దవి 

మిర్చి                    రెండు 

అల్లంవెల్లుల్లిముద్ద      అరస్పూను

గరంమసాలా పొడి      ఒక స్పూను 

కరివేపాకు                ఒక రెమ్మ 

కొత్తిమీర                  అర కప్పు 

ఉప్పు,కారం               తగినంత 

నూనె                      రెండు టేబుల్ స్పూన్లు 

తాలింపుకు  శనగపప్పు,మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,జీలకర్ర.


తయారు చేసే విధానం:



ముందుగా ఎగ్స్ ఒక గిన్నెలో వేసి బాగా బీట్ చెయ్యాలి.తరువాత 

కొంచెం ఉప్పు,కారం వేసి ఇంకోసారి బీట్ చెయ్యాలి.

ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లో వేసి ఆవిరి మీద ఉడికించి, చల్లారాక 

ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి. 


నూనె వేడి చేసి తాలింపు వేసి ,కరివేపాకు ,సన్నగా తరిగిన ఉల్లి మిర్చి 

ముక్కలు వేసి దోరగా వేయించాలి.

ఇప్పుడు తరిగిన టమాటా వేసి బాగా మగ్గనివ్వాలి.తరువాత ఉప్పు,

కారం,పసుపు,అల్లం వెల్లుల్లి ముద్ద  వేసి బాగా వేయించాలి.


కూర దగ్గరవుతుండగా ఎగ్ పీసెస్ ని వేసి గరం మసాలా పొడి వేసి 

బాగా కలిపి ఒక నిమిషం తరువాత దించెయ్యాలి.


సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి వేడిగా వడ్డిస్తే  కమ్మని  ఎగ్ ఫ్రై  రెడీ.


ఎగ్స్ బీట్ చెయ్యడం,ఉడికించడం పని అనుకుంటే సింపుల్ గా ఆమ్లెట్ 

వేసి ఆ పీసెస్ తో ఈ కర్రీ చేసుకుంటే ఆమ్లెట్ కర్రీ సిద్దం.






 


Share/Bookmark

Tuesday, January 4, 2011

బ్రెడ్ 65 (మంచూరియా )

బ్రెడ్ తో రకరకాల వెరైటీలు నిమిషాల్లో చేసుకోవచ్చు.ఉదయం టిఫిన్

కోసం అయినా, సాయంత్రం స్నాక్స్ కోసమైనా బ్రెడ్ ఇంట్లో ఉంటే హ్యాపీ.

నాలుగు స్లైసులు బ్రెడ్ ఉంటే ఈ రోజు బ్రెడ్ 65 చేశాను. తోటకూర పప్పు 

కూరలోకి జతగా చాలా బావుంది.మీరూ ట్రై చెయ్యండి.
















కావలసిన పదార్ధాలు:


బ్రెడ్                    నాలుగు స్లైసులు 

ఉల్లిపాయ              ఒకటి 

మిర్చి                  నాలుగు 

కారట్ తురుము      కొంచెం 

కాప్సికం               ఒకటి చిన్నది 

ఉప్పు,కారం           తగినంత

పెరుగు                ఒక కప్పు 

వెల్లుల్లి                  నాలుగు రెబ్బలు 

కరివేపాకు              రెండు రెమ్మలు 

నూనె                   తగినంత



తయారు చేసే విధానం:

ముందుగా బ్రెడ్ స్లైసెస్ ని నీళ్ళల్లో వేసి వెంటనే పిండి ఒక బౌల్ లో 

వేసుకోవాలి.

ఇందులో సన్నగా తరిగిన ఉల్లి, ఒక మిర్చి,కాప్సికం, కారట్ తురుము,

కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి ఉంచుకోవాలి.

నూనె వేడి చేసి ఈ ఉండలు వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.

ఇప్పుడు వేరే పాన్ లో ఒక స్పూన్ నూనె వేడి చేసి సన్నగా తరిగిన 

వెల్లుల్లి,మిర్చి,కరివేపాకు వేసి వేయించాలి.

కొంచెం వేగిన తరువాత బ్రెడ్ ఉండలు వేసి చిటికెడు ఉప్పు,కారం వేయాలి.

ఇప్పుడు పెరుగును కొంచెం బీట్ చేసి ఇందులో వేసి సన్నని సెగపై

అంతా  ఇగిరి పోయి పొడిపొడిగా అయ్యెవరకూ వేయించాలి

ఒక బౌల్ లోకి తీసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి వేడి గా సర్వ్ 

చేస్తే బ్రెడ్ 65 నోరూరిస్తుంది.

ఇంకా ఇష్టం ఉన్నవారు సన్నగా తరిగిన కాబేజ్,ఉల్లి కాడలు కూడా 

కలుపుకోవచ్చు.

బ్రెడ్ మంచూరియా:

నూనె వేడిచేసి వెల్లుల్లి,మిర్చికరివేపాకు వేయించి,ఫ్రై చేసిన బ్రెడ్ 

ఉండలని వేసి ఒక స్పూన్ సోయాసాస్,ఒక స్పూన్ టమాటాసాస్,

ఒక స్పూన్ రెడ్ చిల్లి సాస్ వేసి,ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ని నీటిలో

కలిపి పోసి డ్రై గా అయ్యేవరకూ వేయించితే బ్రెడ్ మంచూరియా రెడీ 

అవుతుంది.


 


Share/Bookmark

Saturday, January 1, 2011

సేమ్యా చక్రపొంగలి

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 

ఈ కొత్త సంవత్సరంలో తీయతీయగా కమ్మని ఈ స్వీట్ చేసుకుందాం.

చక్రపొంగలి అనగానే నోరూరిపోతుంది కదా.ఎప్పుడూ చేసినట్టు రైస్ తో 

కాకుండా సేమ్యా తో చెయ్యడమే ఈ వెరైటీ. 












కావలసిన పదార్ధాలు :



సేమ్యా                        రెండు కప్పులు 

పెసరపప్పు                   ముప్పావు కప్పు 

బెల్లం                         రెండు కప్పులు 

పంచదార                    అర కప్పు 

పాలు                        మూడు కప్పులు

నెయ్యి                       అర కప్పు

యిలాచీ పొడి               ఒక స్పూను 

కాజూ                         తగినన్ని 


తయారు చేసే విధానం:

ముందుగా పెసరపప్పు  కుక్కర్ లో వేసి తగినన్ని నీళ్ళు పోసి 

ఉడికించుకోవాలి.

రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి  చేసి కాజూ వేయించి , 

పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు ఇదే నెయ్యిలో సేమ్యా వేసి బంగారు రంగు వచ్చేవరకూ  

వేయించాలి.

వేగిన సేమ్యాలో కాగిన పాలు పోసి ఉడకనివ్వాలి.సేమ్యా ఉడికిన 

తరువాత ఉడికించిన పెసరపప్పు కూడా వేసి బాగా కలపాలి.

ఇందులో సన్నగా తరిగిన బెల్లం,పంచదార వేసి కలిపి ఉడికించాలి. 

బాగా దగ్గరయ్యేటప్పుడు ఇలాచీ పొడి,మిగిలిన నెయ్యి వేసి కలిపి 

దించెయ్యాలి.

ఇందులో పంచదార,బెల్లం  ఎవరి రుచి కి తగ్గట్టు  ఎక్కువ తక్కువ 

వేసుకోవచ్చు

బౌల్ లోకి తీసుకుని వేయించిన కాజూ తో అలంకరించుకుంటే  వేడి వేడి 

సేమ్యా చక్రపొంగలి సిద్దం
















Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP