Showing posts with label పిండివంటలు. Show all posts
Showing posts with label పిండివంటలు. Show all posts

Sunday, November 4, 2012

కజ్జికాయలు

పండగలకి చేసే ముఖ్యమైన పిండివంటల్లో ఈ కజ్జికాయలు చాల 

ఫేమస్.వీటిని కొంతమంది పుట్నాలపప్పు పొడితో,మరి కొందరు 

రవ్వతోనూ చేస్తారు.అలాగే చాలామంది పంచదారతో చేస్తారు కానీ 

బెల్లం ఎక్కువ వేసి కొద్దిగా పంచదార వేస్తే చాలా రుచిగా ఉంటాయి.








కావలసిన పదార్ధాలు :



మైదాపిండి                           పావుకిలో 

వెన్న లేదా నెయ్యి                  రెండు టేబుల్ స్పూన్స్ 

ఉప్పు                                   కొద్దిగా 


లోపల నింపడానికి 



బొంబాయిరవ్వ                             రెండు కప్పులు

ఎండుకొబ్బరి                               ఒక కప్పు 

బెల్లంతురుము                             ఒక కప్పు 

పంచదార                                   మూడు స్పూన్స్ 

కాజూ,బాదం                               పది పది చొప్పున 

కిస్మిస్                                        పది 

ఇలాచీ పొడి                               అర స్పూన్ 

నూనె  


తయారు చేసే విధానం:



మైదాపిండిలో  వెన్న లేదా నెయ్యి ,కొద్దిగా ఉప్పు వేసి కొంచెం నీరు 

చల్లుకుంటూ పూరీ పిండిలా కలుపుకుని మూతపెట్టి ఉంచాలి.

ఒక పాన్ లో బొంబాయిరవ్వ వేసి సన్నని సెగపై వేయించాలి.కాస్త 

వేగిన తరువాత తురిమిన ఎండుకొబ్బరి కూడా వేసి కమ్మని సువాసన 

వచ్చేవరకూ వేయించాలి.

ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని తురిమిన బెల్లం,పంచదార,

ఇలాచీపొడి,సన్నగా తరిగిన కాజూ,బాదాం,కిస్మిస్ అన్నీ వేసి బాగా 

కలపాలి.

ఇప్పుడు నానిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలు చేసి పూరీలు 

చేసుకోవాలి.

కజ్జికాయల చెక్కకు కొంచెం నూనె రాసి ఈ పూరీని దానిపై వేసి  

మధ్యలో  రెండు స్పూన్స్ రవ్వ మిశ్రమం వెయ్యాలి.

అంచులు తడిచేసి చెక్కను ప్రెస్ చేసి కజ్జికాయలను చేసుకోవాలి.

ఇలా అన్నీ చేసుకుని కాగిన నూనెలో రెండువైపులా వేయించి 

తీసుకోవాలి. 

చల్లారాక స్టోర్ చేసుకుంటే ఇవి వారం రోజులవరకూ నిలువ ఉంటాయి. 


Share/Bookmark

Saturday, March 3, 2012

పనసతొనలు

చాలా ఫేమస్ స్వీట్ ఇది.సింపుల్ గా చేసుకోగల ఈ స్వీట్ పంచదార 

పాకం పీల్చుకుని రెండు మూడు రోజులవరకూ జ్యూసీగా చాలా రుచిగా 

ఉంటాయి.






కావలసిన పదార్ధాలు:


మైదాపిండి                       ఒకకప్పు 

పంచదార                        ఒకకప్పు 

వెన్నలేదా నెయ్యి            రెండు టేబుల్ స్పూన్లు 

ఇలాచీపొడి                      అర టీ స్పూన్ 

నూనె 


తయారు చేసే విధానం:


మైదాపిండిలో వెన్నకానీ,నెయ్యి కానీ వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లుతూ పూరీపిండిలా మృదువుగా కలిపి ఒక 

అరగంట నాననివ్వాలి.

పంచదారలో కొంచెం నీళ్ళు పోసి తీగపాకం పట్టుకోవాలి.ఇందులో ఇలాచీ

పొడి వేయాలి.

నానిన పిండిని చిన్నచిన్న ఉండలు చేసి పూరీలు చెయ్యాలి.వీటిని 

చివరలు విడకుండా మధ్యలో కట్ చేసి రెండువైపుల నుండీ మడుస్తూ 

వచ్చి చివరలు ప్రెస్ చేయాలి.

ఇలా చేసుకున్న పనసతొనలను కాగిన నూనెలో వేయించి పంచదార 

పాకంలో వేయాలి.

రెండుమూడు నిమిషాల తరువాత తీసి ఒక ప్లేట్ లో ఉంచాలి.

చల్లారిన తరువాత స్టోర్ చేసుకోవాలి  
 


Share/Bookmark

Wednesday, November 16, 2011

బూందీ మిఠాయి

బెల్లం,కొంచెం పంచదార కలిపి చేసే అచ్చుమిఠాయి ఇది.పంచదార 

లడ్డూలా మెత్తగా కాకుండా కరకరలాడుతూ ఉంటుంది.చెయ్యగలిగితే 

వేడిమీద లడ్డూలు కూడా చుట్టుకోవచ్చు.







కావలసిన పదార్ధాలు:


శనగపిండి                           రెండు గ్లాసులు

బియ్యంపిండి                         ఒక గ్లాసు

బెల్లం                                 రెండు గ్లాసులు 

పంచదార                             ఒక గ్లాసు

యాలకుల పొడి                    ఒక టీ స్పూన్

నూనె 


తయారు చేసే విధానం:


శనగపిండి,బియ్యంపిండి తగినన్ని నీళ్ళతో కొంచెం జారుగా 

కలుపుకోవాలి.

ఈ పిండిని బూందీ గరిటలో వేసి కాగిన నూనెలో బూందీ దూసుకోవాలి.

వేగిన తరువాత తీసి జల్లెడలో వేసుకోవాలి.ఇలా బూందీ అంతా రెడీ 

చేసుకోవాలి  

బెల్లం,పంచదార కొంచెం నీళ్ళు పోసి కరిగించి వడపోయాలి.

ఇప్పుడు తిరిగి స్టవ్ పైన ఉంచి బాగా ఉండపాకం పట్టుకోవాలి.ఇందులో 

యాలకులపొడి,బూందీ వేసి బాగా కలిపి పళ్ళెంలో అచ్చు పోసెయ్యాలి.

కాసేపగితే అచ్చు వచ్చేస్తుంది.చిన్నచిన్నముక్కలు చేసి స్టోర్ 

చేసుకోవాలి.

కావాలనుకుంటే అచ్చు పోయకుండా లడ్డూలు చేసుకోవచ్చు.


Share/Bookmark

Monday, October 24, 2011

బొబ్బట్లు

పండగలు అంటేనే స్పెషల్స్,పిండివంటలు తప్పనిసరి.అందులో బాగమే 

ఈ తియ్య తియ్యని బొబ్బట్లు.వీటినే భక్ష్యాలు అని కూడా అంటారు.









కావలసిన పదార్ధాలు 


మైదాపిండి                         రెండు కప్పులు 

వెన్నపూస                         రెండు టేబుల్ స్పూన్స్ 

 ఉప్పు                               చిటికెడు 

నూనె                              ఒక టీ స్పూన్ 



శనగపప్పు                         ఒక గ్లాస్ 

బెల్లం                              ఒకటిన్నర గ్లాస్ 

పంచదార                          అర గ్లాస్ 

పచ్చికొబ్బరి                       ఒక కప్పు

ఇలాచీపొడి                       ఒక టీ స్పూన్


 తయారు చేసేవిధానం:


శనగపప్పు మెత్తగా ఉడికించాలి.ఇందులో తరిగిన బెల్లం,పంచదార,

కొబ్బరితురుము కలిపి బాగా దగ్గరయ్యేవరకు ఉడికించాలి.

ఇందులో ఇలాచీపొడి వేసి కలిపి చల్లారనివ్వాలి.

ఈలోగా మైదాపిండిలో ఉప్పు,వెన్నపూస కలిపి తగినన్ని నీళ్ళతో 

చపాతీపిండిలా మృదువుగా కలపాలి.ఈ పిండికి కొంచెం నూనె రాసి 

ఒక గంట నాననివ్వాలి.

ఇప్పుడు నానిన పిండిని చిన్న ఉండ తీసుకుని  కొంచెం వత్తి మధ్యలో 

శనగపప్పు మిశ్రమాన్ని పెట్టి అన్నివైపులా మూసి ఉండ చేసుకోవాలి.

దీన్ని పలుచని చపాతీలా వత్తి తవాపై  రెండువైపులా నేతితో కాల్చాలి.



Share/Bookmark

Saturday, October 22, 2011

కారప్పూస

పిండివంటల్లో ఎక్కువ చేసుకునేది కారప్పూస.శలవులు వచ్చాయంటే 

పిల్లలకి  ఇదో,జంతికలో ఏవో ఒకటి ఉండాల్సిందే.







కావలసిన పదార్ధాలు:



శనగపిండి                          అరకిలో 

బియ్యంపిండి                       అరకిలో 

వెన్నపూస                         వంద గ్రాములు 

ఉప్పు,కారం                         తగినంత 

వాము పొడి                        రెండు టీ స్పూన్స్ 

నూనె 


 
తయారు చేసే విధానం:


శనగపిండి,బియ్యంపిండి జల్లించి ఉప్పు,కారం,వాముపొడి,వెన్న వేసి 

బాగా కలుపుకోవాలి. 

కొంచెం పిండిని తగినన్ని నీళ్ళతో ముద్ద చేసుకుని జంతికల గిద్దలో పెట్టి

కాగిన నూనెలో వత్తుకోవాలి.

రెండువైపులా వేయించి తీసుకోవాలి.

చిన్నటిప్: మొత్తం పిండి ఒక్కసారే ముద్దగా కలిపి వండితే కారప్పూస 

ఎర్రగా వస్తుంది,అందుకని ప్రతిసారీ వత్తేముందు కొంచెం కొంచెంగా 

కలుపుకోవాలి.



Share/Bookmark

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP