Friday, May 20, 2011

చికెన్ పచ్చడి

చికెన్ పచ్చడి అనగానే నోరూరుతుంది కదూ.చికెన్ కూర ఎంత ఈజీగా 

చేస్తామో ఈ పచ్చడి కూడా అంతే సులువుగా చెయ్యొచ్చు.ఒక్కొక్కరు 

ఒక్కో విధంగా చేస్తారు ఈపచ్చడిని.సింపుల్ గా నేను చేసే విధానం 

చెప్తాను.ఈ పచ్చడి ఫ్రిజ్ లో ఉంటే ఎంత హాయో చెప్పలేను.ఒక్క కూరే 

చేసినా,సాంబారు ఒకటే ఉన్నా,ఒకపూట కూర చెయ్యక పోయినా 

చల్తాహై అన్నమాట.మా ఇంట్లో ఫేవరేట్ ఐటం ఈ చికెన్ పచ్చడి.







కావలసిన  పదార్ధాలు : 


చికెన్                                         కేజీ

అల్లంవెల్లుల్లి ముద్ద                      మూడు టీ స్పూన్లు

కారం                                      నాలుగు టీ స్పూన్లు

ఉప్పు                                      నాలుగు టీ స్పూన్లు

పసుపు                                   పావు టీ స్పూన్ 

నూనె                                      పావు కిలో 

నిమ్మకాయలు                            నాలుగు 

కరివేపాకు                                 రెండు రెమ్మలు 

ఆవాలు                                     కొంచెం


మసాలాకు

లవంగాలు                               పది

చెక్క                                     రెండు పెద్ద ముక్కలు

జీలకర్ర                                  రెండు టీ స్పూన్లు

ధనియాలు                             రెండు టేబుల్ స్పూన్లు

గసగసాలు                              మూడు టేబుల్ స్పూన్లు

ఎండుకొబ్బరి                           పావు చిప్ప


తయారు చేసే విధానం ;


ముందుగ చికెన్ ముక్కలను కడిగి నీరు పోయేలా జల్లెడలో వేసి 

ఉంచుకోవాలి.

నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేసి వేగాక చికెన్ ముక్కలు 

వేయాలి.నీరంతా ఇగిరిపోయి చికెన్ వేగి నూనె తేలేవరకు మధ్యలో 

తిప్పుతూ ఉడకనివ్వాలి.దీనికి షుమారుగా పావుగంట పడుతుంది.

ఈలోగా అల్లంవెల్లుల్లిని తడి తగలకుండా మెత్తగా ముద్ద చేసుకోవాలి.

మసాలాకు  రాసిన దినుసుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి.

చికెన్ ముక్కలు వేగి నూనె తేలిన తరువాత పసుపు,అల్లంవెల్లుల్లి 

ముద్ద వేసి బాగా కలిపి వేయించాలి.మూడు నిమిషాల తరువాత 

మసాలా పొడి,ఉప్పు వేసి కలిపి సన్నని సెగపై ఈ మిశ్రమం మొత్తం 

వేగి నూనె తేలేవరకు వేయించాలి. 

చివరిగా కారం వేసి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలపాలి .

చల్లారిన తరువాత నిమ్మరసం పోసి కలిపితే రుచికరమైన చికెన్ 

పచ్చడి రెడీ అవుతుంది.

ఒక బాటిల్ లో పెట్టుకుని ఫ్రిజ్ లో ఉంచుకుని తడి తగలకుండా 

వాడుకుంటే దాదాపు ఇరవైరోజులు ఉంటుంది. 

నోట్:  ఎవరి రుచికి తగ్గట్టు ఉప్పు,కారం,మసాలాలు,నిమ్మరసం 

ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.














Share/Bookmark

0 comments:

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP