మాగాయ పచ్చడి
ఆవకాయ తరువాత అంతగానూ ఇష్టపడి తినే పచ్చడి మాగాయ.
మాగాయ మహాపచ్చడి,పెరుగేస్తే మహత్తరి అంటూ పాట కూడా
రాసారు కదా.అంత రుచిగా ఉండే ఈ పచ్చడి ఎలా చెయ్యాలో చూద్దాం.
ఈపచ్చడికి స్పెషల్ గా రసాలు,జలాలు అంటూ వెతకవలసిన అవసరం
లేదు.మామూలు కాయలైనా పుల్లగా ఉంటే చాలు చేసెయ్యొచ్చు.
కావలసిన పదార్ధాలు :
మామిడికాయలు రెండు
కారం మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు తగినంత
ఆవపిండి ఒక టీ స్పూన్
మెంతిపిండి అర టీ స్పూన్
నూనె ఒక కప్పు
కరివేపాకు రెండు రెమ్మలు
పసుపు చిటికెడు
తాలింపుకు శనగపప్పు.మినప్పప్పు,ఆవాలు,ఎండుమిర్చి,వెల్లుల్లిరెబ్బలు
తయారు చేసే విధానం:
మామిడికాయను చెక్కుతీసి కడిగి తుడిచి వాలికలుగా ముక్కలు
కొయ్యాలి
ఈ ముక్కలలో ఒక స్పూన్ ఉప్పు,చిటికెడు పసుపు వేసి బాగా కలిపి
రెండు మూడు గంటలు ఉంచాలి.
ఇప్పుడు ఊరిన రసంలో నుండి ముక్కలు వేరుచేసి ఎండలో పెట్టాలి
.
మంచి ఎండలో రెండు గంటలు ఉంచితే చాలు.
ఈ మామిడి రసం లో కారం,ఆవపిండి,మెంతి పిండి,తగినంత ఉప్పు
వేసి,చివరగా మామిడి ముక్కలు కూడా వేసి బాగా కలపాలి
నూనె వేడి చేసి తాలింపు వేసి,చిదిమిన వెల్లుల్లిరెబ్బలు,కరివేపాకు వేసి ,
ఈ తాలింపును పచ్చడిలో కలిపితే ఎర్రగా నోరూరిస్తూ మాగాయపచ్చడి
రెడీ.ఇష్టం ఉన్నవారు తాలింపులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు
3 comments:
దీన్ని నూనె మాగాయ అంటారండి! "అసలు" మాగాయ రెసిపీ వేరే కదా!
నీలాంచల గారూ
నాకు తెలిసిన మాగాయ ఇదేనండి. మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే పెడతారు ఇందులో కూడా రకాలు ఉన్నాయేమో తెలియదు
ముక్కలు ఒక రోజంతా ఎండ పెడతారు కానీ అంతసేపు ఉంచితే బాగా గట్టిగా అవుతాయని మేము ఒక రెండు గంటలు ఎండలో పెడతాము
లత గారూ, మీ రెసిపీలు ఎన్నో చేస్తుంటానండీ. ఈ రోజు ఈ మాగాయ చేశాను. Thanks so much!
Post a Comment