Sunday, March 20, 2011

చేపల పులుసు

చేపలపులుసు అనగానే నోరు ఊరిపోతుంది.చికెన్ తరువాత నాన్ వెజ్  

ప్రియులు ఇష్టపడేది చేపల పులుసు అంటే అతిశయోక్తి కాదు. కొంచెం

స్పైసీగా,పుల్లపుల్లగా,కమ్మగా ఉండే ఈ పులుసు పెట్టడం ఎలాగో 

చూద్దామా 





కావలసిన పదార్ధాలు :

చేప ముక్కలు                     కేజీ 

ఉల్లిపాయలు                       మూడు

మిర్చి                               నాలుగు 

కరివేపాకు                         రెండు రెమ్మలు 

కొత్తిమీర                           ఒక కట్ట 

ఉప్పు,కారం                       తగినంత

పసుపు                            అర స్పూన్ 

నూనె                               ఒక కప్పు 

చింతపండు పులుసు              ఒక కప్పు 

అల్లం                                రెండు అంగుళాల ముక్క 

వెల్లుల్లిరెబ్బలు                      పది 

ఎండుకొబ్బరి                       చిన్న ముక్క 


మసాలాదినుసులు 

లవంగాలు                           ఎనిమిది 

దాల్చిన చెక్క                       రెండు ముక్కలు 

జీలకర్ర                               రెండు స్పూన్లు 

ధనియాలు                         రెండు స్పూన్లు 

గసగసాలు                          రెండు స్పూన్లు 


తయారు చేసే విధానం:

ముందుగా చేపముక్కలను శుభ్రంచేసి, కొంచెం ఉప్పు,కారం,పసుపు

ఒక స్పూన్ నూనె వేసి కలిపి ఉంచాలి.

మసాలా దినుసులు  అన్నీ మెత్తగా పొడి కొట్టి ఉంచుకోవాలి 

అల్లం, వెల్లుల్లి, ఎండుకొబ్బరి కొంచెం నీటితో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి

వెడల్పుపాన్ లో నూనె వేడిచేసి తాలింపు వేసి,కరివేపాకు,సన్నగా 

తరిగిన ఉల్లిపాయలు,చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించాలి.

బాగా వేగిన తరువాత అల్లంవెల్లుల్లి కొబ్బరి ముద్ద వేసి వేయించాలి. 

పచ్చివాసన పోయిన తరువాత మసాలాపొడి వేసి,ఉప్పు,పసుపు ,

కారం వేసి నూనె తేలేవరకు వేయించాలి.

ఇప్పుడు చేపముక్కలు వేసి రెండు నిమిషాల తరువాత జాగ్రత్తగా 

వాటిని ఒక్కొక్కటిగా తిరగెయ్యాలి.

రెండు నిమిషాల తరువాత చిక్కగా తీసిన చింతపండు పులుసు పోసి 

ఉడికించాలి.

మధ్య మధ్యలో పాన్ ని  మొత్తంగా తిప్పుతూ సన్నని సెగపై పులుసు 

చిక్కబడి నూనె తేలేవరకూ ఉడికించాలి. గరిటతో తిప్పకూడదు.

ముక్కలు చితికిపోతాయి 

చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి రెండు నిమిషాల తరువాత 

దించెయ్యాలి.

చల్లారిన తరువాత ఇంకా రుచిగా ఉండే ఈ పులుసు రెండు రోజులైనా 

అదే రుచితో ఘుమఘుమలాడుతూ ఉంటుంది



Share/Bookmark

2 comments:

Shiva Bandaru

చేపలపులుసు నాకు బాగా నచ్చే కూర. ఫోటో చూస్తుంటే తెలిసిపోతుంది చాలా బాగా చేసారని.

లత

మీ కామెంట్ ఇప్పుడే చూశాను శివగారు, థాంక్స్ అండీ

Post a Comment

అభిరుచి   © 2008. Template Recipes by Emporium Digital

TOP